
జూన్‌లోనూ..జ్వాలాతోరణ‘మే’
పగబట్టిన పాము బుసలా, రగిలే జ్వాలాతోరణంలా జిల్లాలో వాతావరణం జూన్‌లోనూ ఉగ్రరూపాన్ని కొనసాగిస్తోంది. చేరువలో ఏదో అగ్ని పర్వతం బద్దలైందా అన్నట్టు గాలి సెగలు కక్కుతోంది.
సాక్షి, రాజమండ్రి :పగబట్టిన పాము బుసలా, రగిలే జ్వాలాతోరణంలా జిల్లాలో వాతావరణం జూన్‌లోనూ ఉగ్రరూపాన్ని కొనసాగిస్తోంది. చేరువలో ఏదో అగ్ని పర్వతం బద్దలైందా అన్నట్టు గాలి సెగలు కక్కుతోంది. ఎండనూ, వాననూ లెక్కచేయక కండల్ని కరిగించే కష్టజీవులు సైతం.. ఎండ ముదిరే వేళకు పనులు కట్టిపెట్టి, నీడపట్టును వెతుక్కోవలసి వస్తోంది. ఇక.. కష్టం తెలియని సుఖజీవుల గురించి చెప్పేదేముంది! ఇళ్లు వదిలి, కాలు బయట మోపడానికే భీతిల్లుతున్నా రు. జూన్ రెండో వారంలోనూ ఉగ్రరూపాన్ని చాలించి, శాంతించని గ్రీష్మం.. అందరినీ గడగడలాడిస్తోంది. గత ఐదేళ్లలో జూన్‌లో ఇంత అధిక ఉష్ణోగ్రతలు నమోదవడం ఇదే మొదటిసారి అని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.
ఓ పక్క ఎండల తీవ్రత, మరోపక్క కరెంటు కోత ప్రజలకు నరకాన్ని చవి చూపిస్తున్నాయి. జిల్లాలో రెండు రోజు లుగా ఉష్ణోగ్రతలు పెచ్చరిల్లుతున్నాయి. గురువారం జిల్లావ్యాప్తంగా 42 నుంచి 45 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గత ఏడాది జూన్ పది నుంచి వాతావరణం చల్లబడింది. రెండో వారం నాటికి జిల్లాలో 25 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఉష్ణోగ్రతలు కూడా 36 నుంచి 38 డిగ్రీల మధ్యకు పడిపోయాయి. కానీ ఈ ఏడాది జూన్ రెండో వారం ముగుస్తున్నా దరిదాపుల్లో కరిమబ్బులు కనిపించడంలేదు. నాలుగు రోజుల క్రితమే వచ్చేశాయని చెప్పిన రుతుపవనాలు కూడా.. సూర్యప్రతాపానికి జడిసినట్టు.. జాడ లేకుండా పోయాయి. వాతావరణం రోహిణీ కార్తెను మించి రగిలిపోతుండడంతో తొలకరి సాగుకు సిద్ధమవుతున్న రైతులూ నిట్టూరుస్తున్నారు.
కాకినాడలో గరిష్టానికి చేరిన కనిష్ట ఉష్ణోగ్రత..
గురువారం రాజమండ్రిలో జిల్లాలో అత్యధికంగా 45 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. కనిష్ట ఉష్ణోగ్రత 30 డిగ్రీలు. కాకినాడలో గరిష్టం 43, కనిష్టం 35; అమలాపురంలో గరిష్టం 42.5, కనిష్టం 29; మండపేటలో గరిష్టం 44, కనిష్టం 28.5; జగ్గంపేటలో గరిష్టం 44, కనిష్టం 29.5; తునిలో గరిష్టం 43, కనిష్టం 28; రంపచోడవరంలో గరిష్టం 42, కనిష్టం 28 డిగ్రీలుగా నమోదయ్యాయి. సముద్ర తీరంలో ని కాకినాడలో వేసవిలో కనిష్ట ఉష్ణోగ్రత 29 నుంచి 31 డిగ్రీల మధ్య నమోదవుతుంటుంది. కానీ గురువారం ఇక్కడి కనిష్ట ఉష్ణోగ్రత 35 డిగ్రీలు. ఇది జూన్‌లో ఇక్కడ నమోదయ్యే గరిష్ట ఉష్ణోగతకు సమానం.
పుండుపై కారంలా పవర్ కట్
తూలిపడ్డ వేళే.. కాలిలో ముల్లు గుచ్చుకున్నట్టు.. ఉష్ణోగ్రతకు.. ఎడాపెడా విధిస్తున్న కరెంటు కోతలు తోడై జనాన్ని మరింత కష్టాల పాలు చేస్తోంది. రాజమండ్రి, కాకినాడల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకూ నాలుగు నుంచి ఆరు గంటలు, పట్టణాలు, మండల కేంద్రాల్లో ఆరు గంటలకు పైగా, గ్రామాల్లో వేళాపాళా లేకుండా ఆరు గంటలకు పైగా కోత పెడుతున్నారు. రాత్రి వేళల్లో కరెంటు కోతలు లేకుండా చూస్తామన్న అధికారులు.. నాలుగు రోజులుగా ఆ మాటకు చెల్లుచీటీ ఇచ్చేశారు. రాత్రి 11.00 గంటల నుంచి తెల్లవారు జామున 3.00 వరకూ గంట నుంచి రెండు గంటలకు పైగా ప్రాంతాల వారీ కోతలు అమలు చేస్తున్నారు. వర్షాలు పడి ఉత్పత్తి పెరిగితే తప్ప కోతలు తగ్గే అవకాశాలు లేవంటున్నారు.
వడదెబ్బకు 15 మంది బలి
తొలకరి జల్లులతో సేద దీరాల్సిన వేళ జిల్లాలో మృత్యుకీలలు చెలరేగుతున్నాయి. గురువారం వీచిన వడగాడ్పులకు జిల్లావ్యాప్తంగా 15 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో కొందరు వృద్ధులు కాగా మరి కొందరు కష్టజీవులు. కాగా జిల్లాలో వేసవి సెలవుల అనంతరం ప్రభుత్వ పాఠశాలలను తిరిగి తెరిచింది గురువారమే. అయితే కొనసాగుతున్న గ్రీష్మ ప్రతాపాన్ని పరిగణనలోకి తీసుకుని.. బాలల శ్రేయస్సు దృష్ట్యా ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు శుక్రవారం సెలవు ప్రకటించారు. రెండో శనివారం, ఆదివారం కలిసి రావడంతో తిరిగి బడులు పని చేసేది సోమవారమే. ఈలోగా వాతావరణం కొంత శాంతించగలదని భావిస్తున్నారు.