
నిఘా నేత్రం
- మేడారంలో వాచ్ టవర్ల ఏర్పాటు
- కొత్తగా ఆరు నిర్మాణం
- పూర్తి కావస్తున్న పనులు
మేడారం, న్యూస్‌లైన్ : మేడారం మహా జాతరపై నిరంతరం నిఘా కొనగనుంది. ఇందులో భాగంగా ఈసారి అధికారులు వాచ్ టవర్స్(మంచెలు) ఏర్పాటు చేస్తున్నారు. జాతరకు కోటికి పైగా భక్తులు వస్తారన్న అంచనాతో.. పర్యవేక్షణకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కలెక్టర్ కిషన్ ప్రత్యేక చొరవతో రాజీవ్ విద్యామిషన్ ఆధ్వర్యంలో వాచ్ టవర్స్ నిర్మిస్తున్నారు. లక్షలాది మంది భక్తుల కదలికలను గుర్తిస్తూ.. అంవాంఛనీయ సంఘటనలు జరుగకుండా వాచ్ టవర్స్‌పై నుంచి అధికారులు పర్యవేక్షణ చేయనున్నారు.
ఇప్పటికే సీసీ కెమెరాల ఏర్పాటుకు చర్యలు ముమ్మరమయ్యాయి. సీసీ కెమెరాలను ఎల్‌సీడీలకు అనుసంధానం చేసుకుని అధికారులు జాతరను పర్యవేక్షిస్తారు. మేడారం పరిసరాల్లో రద్దీగా ఉండే ప్రాంతాలను గుర్తించి ఐదు టవర్స్ ఏర్పాటు చేస్తున్నారు. మీడియా అభ్యర్థన మేరకు గద్దెల వద్ద ఉన్న వాచ్‌టవర్‌ను ఆనుకుని మరొకటి అదనంగా నిర్మిస్తున్నారు. దీంతో మొత్తం ఆరు టవర్స్ అవుతున్నాయి. ఒక్కో టవర్ నిర్మాణానికి *6.50 లక్షలు వెచ్చించారు. ఇదివరకు కేవలం గద్దెల వద్ద మాత్రమే మంచె ఉండగా దీనిపై ఉండి పర్యవేక్షణ చేయడం అధికారులకు కష్టంగా ఉండేది.. దీనికితోడు మీడియా కూడా తమ కవరేజీకి ఈ మంచెనే ఉపయోగించేది.
దీంతో మరింత ఇబ్బందులు తలెత్తేవి. ఇది కేవలం గద్దెల వద్ద మాత్రమే భక్తుల రద్దీని పర్యవేక్షించే వీలుండేది. దీంతో లక్షల సంఖ్యలో భక్తులు విడిది చేసే జాతర పరిసర ప్రాంతాల్లో పర్యవేక్షణ అధికారులకు కష్టంగా ఉండేంది.. ఈక్రమంలో పర్యవేక్షణను సులువు చేసుకునేందుకు యంత్రాంగం ఈ సారి అదనపు వాచ్‌టవర్స్ ఏర్పాటుకు పూనుకుంది. వాచ్‌టవర్ పై భాగంలో అధికారులు ఉండి జాతరలోని భక్తుల కదలికలను చూసేందుకు అనువుగా ఉంటుంది. కింది భాగంలో అధికారులుండేందుకు గది కూడా నిర్మితమవుతుండడం మరింత సౌకర్యాంగా ఉంది.
రద్దీగా ఉండే చోట్ల..
మేడారం జాతరలో అత్యంత రద్దీగా ఉండే ప్రాంతాల్లో ఆరుచోట్ల కొత్తగా వాచ్ టవర్ల నిర్మాణం జరుగుతోంది. ముఖ్యంగా గద్దెల వద్ద అత్యంత జనసమర్థం ఉంటుంది. అందుకుగాను ఇక్కడ వీఐపీ ద్వారం వైపు గతంలో ఉన్న వాచ్ టవర్‌కు తోడు దాని పక్కనే మరొకటి నిర్మాణం చేస్తున్నారు. అదేవిధంగా గద్దెల వద్ద నుంచి బయటకు వెళ్లే ముఖద్వారం సమీపంలో మరొకటి ఏర్పాటు చేస్తున్నారు. గద్దెల తదుపరి అత్యంత రద్దీ ప్రాంతమైన జంపన్నవాగు వద్ద, ఊరట్టం లోలెవల్ కాజ్‌వే సమీపంలో, ఆర్టీసీ బస్టాండ్ వద్ద, కొత్తూరు కాజ్‌వే సమీపంలో వాచ్ టవర్ల నిర్మాణం జరుగుతోంది. దాదాపుగా నిర్మాణ పనులు పూర్తి కావస్తున్నాయి.