మెగాస్టార్కు అభిమానుల ఝలక్
విశాఖ : మెగాస్టార్ చిరంజీవికి ఆయన అభిమానులు ఝలక్ ఇచ్చారు. కాంగ్రెస్ బస్సుయాత్రను బహిష్కరిస్తున్నట్లు చిరంజీవి అభిమానుల సంఘం అధ్యక్షుడు రాఘవరావు గురువారమిక్కడ తెలిపారు. ప్రజారాజ్యం పార్టీ పెట్టి ....అనంతరం కాంగ్రెస్లో విలీనమై తమను చిరంజీవి నిలువునా ముంచేశారని ఆయన విమర్శించారు. ప్రశ్నించడం కోసం అయితే పరవాలేదని... పోటీ అంటూ రాజకీయాలు చేస్తే పవన్ కల్యాణ్కు ఇబ్బందులు వస్తాయని రాఘవరావు వ్యాఖ్యానించారు.
కాగా సీమాంధ్రలో భూస్థాపితమైన కాంగ్రెస్ పార్టీకి తిరిగి బతికించుకునే బృహత్తర కార్యక్రమానికి కేంద్ర మంత్రి చిరంజీవి, ఏపీ పీసీసీ అధ్యక్షుడు ఎన్. రఘువీరారెడ్డి బస్సు యాత్రకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఈనెల 21 నుంచి శ్రీకాకుళం జిల్లా నుంచి అనంతపూరం వరకూ బస్సు యాత్ర చేయనున్నారు. 2014 ఎన్నికల్లో సీమాంధ్రపై ఆశలు వదలుకున్న కాంగ్రెస్ భవిష్యత్ టార్గెట్‌గానే జనంలోకి వెళ్తోంది. సినీగ్లామర్ ఉన్న చిరంజీవి యాత్రకు జన స్పందన భారీగానే ఉంటుందని కాంగ్రెస్ అంచనా వేస్తోంది. అయితే చిరంజీవి మెగాషో కాంగ్రెస్‌కు ఎంత వరకు కలిసొస్తుందో చూడాలి.