
సాక్షి, నెల్లూరు: విశాఖపట్నం నగరాన్ని ఐటీ హబ్‌గా మార్చబోతున్నామని.. వైజాగ్- చెన్నై కోస్టల్ కారిడార్‌ను అభివృద్ది చేస్తున్నామని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి తెలిపారు. శనివారం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. పాదయాత్రలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీలన్ని నెరవేరుస్తారని స్పష్టం చేశారు. కాగా గత ప్రభుత్వం ఐదేళ్లలో కేవలం ప్రచారంతోనే కాలం గడిపిందని విమర్శించారు. అదే విధంగా టీడీపీ ప్రభుత్వం పరిశ్రమల విషయంలో సరైన నిర్ణయాలు తీసుకోలేదని.. దీంతో పరిశ్రమలు వెనక్కి వెళ్లిపోయాయని మండిపడ్డారు. స్థానిక యువతకు నైపుణ్య శిక్షణ నిర్వహిస్తూ.. వీటి ద్వారా పరిశ్రమల్లో ఉద్యోగాల కల్పనకు కృషి చేస్తామని తెలిపారు.
వైఎస్సార్ నవోదయం ద్వారా 36 వేల చిన్న తరహా పరిశ్రమలు తిరిగి ప్రారంభం కానున్నాయని వెల్లడించారు. వీటితోపాటు మెట్ట ప్రాంతాలైన ఉదయగిరి, ఆత్మకూరు ప్రాంతాల్లో పలు పరిశ్రమలు స్థాపిస్తామని పేర్కొన్నారు. అదే విధంగా ఆత్మకూరు నియోజకవర్గంలో తాగునీటి సమస్యకు పరిష్కారం చూపుతామన్నారు. దీంతోపాటు రాష్ట్రంలో నూతనంగా స్థాపించనున్న పారిశ్రామిక వాడల్లో అన్ని వసతులు కల్పిస్తామని హామీ ఇచ్చారు.