నెల్లూరు(అర్బన్): ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికకు పక్కాగా ఏర్పాట్లు చేస్తున్నామని కలెక్టర్ కేవీఎన్ చక్రధర్‌బాబు తెలిపారు. నెల్లూరులోని కలెక్టరేట్‌లో ఉన్న తిక్కన ప్రాంగణంలో జేసీ హరేంద్ర ప్రసాద్‌తో కలిసి గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వచ్చే నెల 28వ తేదీ వరకు ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుందన్నారు. బ్యాలెట్ యూనిట్స్, కంట్రోల్ యూనిట్స్, వీవీ ప్యాట్స్ సిద్ధం చేశామన్నారు. ఉప ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా జేసీ హరేంద్ర ప్రసాద్ వ్యవహరిస్తారన్నారు.
ప్రత్యేక బృందాల ఏర్పాటు
ఓటర్లలో 80 ఏళ్లు పైబడిన వారు 4,981 మంది, విభిన్న ప్రతిభావంతులు 4,777 మంది ఉన్నారని కలెక్టర్ తెలిపారు. వారు సజావుగా ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రాల్లో వీల్ చైర్లు, సహాయకులను ఏర్పాటు చేస్తామన్నారు. నియోజకవర్గంలో 279 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. 1,000 ఓట్లుపైబడి ఉంటే అదనపు పోలింగ్ కేంద్రాన్ని పెడతామన్నారు. ఓటర్ల జాబితాను అభ్యర్థులకు, పోలింగ్ ఏజెంట్లకు ఇస్తామన్నారు. 648 బ్యాలెట్ యూనిట్స్‌ను, 593 కంట్రోల్ యూనిట్స్‌ను, 583 వీవీ ప్యాట్స్‌ను వినియోగిస్తున్నట్లు తెలిపారు.
ఓటరు స్లిప్పులను ఓటర్లకు అందించి ప్రజలను చైతన్యం చేస్తామన్నారు. సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి బందోబస్తు ఏర్పాటు చేస్తామన్నారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో అధికారులు ఎవరూ పాల్గొనరాదని సూచించారు. ప్రవర్తనా నియమావళి (కోడ్) సక్రమంగా అమలు చేసేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. జిల్లా కోవిడ్ నోడల్ అధికారిగా డీఎంహెచ్‌ఓ డాక్టర్ పెంచలయ్యను నియమించామన్నారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ప్రశాంత వాతావరణంలో ఎన్నికలను పారదర్శకంగా నిర్వహిస్తామన్నారు. సమావేశంలో అడిషనల్ ఎస్పీ హిమావతి, డీఆర్వో వెంకట నారాయణమ్మ, కలెక్టరేట్ పరిపాలనాధికారి సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.
∙ఉప ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి ముఖేష్‌కుమార్ గురువారం అమరావతి నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్ చక్రధర్‌బాబు ఎన్నికల నిర్వహణ గురించి చేపట్టిన చర్యలను వివరించారు. ఈవీఎం యంత్రాల గోదామును తనిఖీ చేశామన్నారు. జేసీ హరేంద్ర ప్రసాద్, ఏఎస్పీ హిమవతి పాల్గొన్నారు.
ప్రశాంత వాతావరణంలో..
నెల్లూరు(వీఆర్సీసెంటర్): ఆత్మకూరు ఉప ఎన్నిక పారదర్శకంగా, ప్రశాంత వాతావరణంలో జరిగేలా చర్యలు తీసుకుంటున్నట్లుగా జిల్లా పోలీసు కార్యాలయం గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. ఎన్నికల నియమావళిని అందరూ పాటించాలని, ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment