మైనింగ్ మోత | Mining crash | Sakshi
Sakshi News home page

మైనింగ్ మోత

Published Mon, Nov 16 2015 11:16 PM | Last Updated on Mon, May 28 2018 4:20 PM

విలువైన భూగర్భ నిక్షేపాలున్న అనకాపల్లి మండలంలో చట్టాలు అక్రమార్కుల చుట్టాలవుతున్నాయి. నివేదికలు బుట్ట దాఖలవుతున్నాయి.

అనకాపల్లి:  విలువైన భూగర్భ నిక్షేపాలున్న అనకాపల్లి మండలంలో చట్టాలు అక్రమార్కుల చుట్టాలవుతున్నాయి. నివేదికలు బుట్ట దాఖలవుతున్నాయి. దర్యాప్తులు తూ తూ మంత్రంగా కొనసాగుతున్నాయి. నిక్షేపాలున్న గ్రామా లు ఇంకా మౌలిక సదుపాయాల లేమితో కొట్టుమిట్లాడుతున్నా గ్రామ సంపదను కొల్లగొట్టి క్వారీ మాఫియా కోట్లాది రూపాయలు వెనకేసుకుంటోం ది. నిబంధనలు తూ చా అమలు చేయాల్సిన అధికారులు, ప్రజాసమస్యలను ఎలుగెత్తి చూపాల్సిన ప్రజాప్రతినిధులు క్వారీ మాఫియా ఇస్తున్న మామూళ్ల మత్తులో జోగుతున్నారు. వెరసి క్వారీ భూతానికి కూతవేటు దూరంలో ఉన్న గ్రామీణులు క్వారీ పేలుళ్లకు వణికిపోతూ కాలం గడిపేస్తున్నారు. అనకాపల్లి మండలంలోని మార్టూరు గ్రామానికి ఆనుకొని ఉన్న క్వారీల ఆగడాలివి.

తూతూ మంత్రంగా  లోకాయుక్త దర్యాప్తు
అనకాపల్లి మండలం  సర్వే నంబర్ 1లో వందలాది ఎకరాల్లో విలువైన భూగర్భ నిక్షేపాలున్నాయి. బ్లాక్‌స్టోన్, రఫ్‌స్టోన్‌తో కలగలిపిన గ్రావెల్ ఉన్న కొండలు మార్టూరుకు ఇప్పుడు శాపంగా మారాయి. దశాబ్దాల తరబడి కొనసాగుతున్న విధ్వంసకాండను నిరసిస్తూ స్థానికులు ఫిర్యాదులు చేస్తున్నా అవి ఎక్కడో ఒక దగ్గర బుట్ట దాఖలవుతున్నాయి. ప్రస్తుతం మార్టూరు సర్వేనంబర్ -1లోని క్వారీలపై లోకాయుక్తాకు వెళ్లిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు జరుగుతోంది. నిశితంగా పరిశీలిస్తే ఈ దర్యాప్తు తూతూ మంత్రంగానే సాగుతోంది. మార్టూరుకు చెందిన స్థానికుడొకరు 2014లో క్వారీల విధ్వంసంపై లోకాయుక్తాకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు  సంబంధిత క్వారీల అనుమతులు, విస్తీర్ణం, ఇతరత్రా అనుమతులపై దర్యాప్తు సాగుతుండగా క్వారీల యజమానుల అడ్రస్సే కానరాకుండాపోయింది.
 సర్వేనంబర్ 1లో 67 క్వారీలున్నాయని భూగర్భ గనుల శాఖ ద్వారా బయటకు రాగా వీటిలో ఏడుగురు క్వారీ యజమానులకు మాత్రమే  రెవెన్యూ యంత్రాంగం నోటీసులు జారీ చేయగలిగింది.  మిగిలిన క్వారీల యజ మానుల చిరునామాలు  రెవెన్యూ యం త్రాంగానికి తెలియకుండా పోయింది. వాస్తవానికి ఎన్‌వోసీ ప్రక్రియతోపాటు రెవెన్యూ హద్దులు, పేలుళ్లకు వాడే నిషిద్ధ వస్తువులపై నిఘాను రెవెన్యూ యంత్రాంగమే పర్యవేక్షించాలి.  క్వారీ యజమానుల చిరునామాలే రెవెన్యూ యంత్రాంగానికి తెలియకపోతే ఇక దర్యాప్తు ఎలా సాగుతుందో ఇట్టే అర్ధం చేసుకోవచ్చు. ఇలా మార్టూరు పరిధిలోని క్వారీలపై వచ్చే అనేక ఫిర్యాదులు బుట్టదాఖలయ్యాయి.
 
 బ్యూరో ఆఫ్ మైనింగ్ నివేదిక ఏమైనట్టు?
 మార్టూరు సర్వేనంబర్ 1 పరిధిలోని క్వారీల్లో తవ్వకాల కోసం తరచూ వినియోగించే పేలుళ్ల వలన సమీపంలోని బొజ్జన్నకొండ చారిత్రక సాక్ష్యాలకు నష్టం కలుగుతుందని బ్యూరో ఆఫ్ మైనింగ్ నివేదిక ఇచ్చింది.  ఈ నివేదికను పక్కతోవ పట్టించి బొజ్జన్నకొండకు మూడు కిలోమీటర్ల లోపు ఎటువంటి పేలుళ్లు లేవని, ఈ కారణంగా బొజ్జన్నకొండకు మూడు కిలోమీటర్లకుపైబడి దూరంలో మార్టూరు క్వారీలున్నాయని అధికార యంత్రాంగం నివేదిక ఇచ్చి చేతులు దులుపుకుంది. ఇలా పురావస్తుశాఖ , రెవెన్యూ శాఖ, భూగర్భ గనులశాఖ, పర్యావరణ శాఖలు వారు క్షేత్రస్థాయిలో చేయాల్సి అధ్యయనం తప్పిదాల వలన మార్టూరు విధ్వంసకాండ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇటీవల అదే గ్రామానికి చెందిన ఒక వ్యక్తి క్వారీ వాహనాల  దూకుడు  వలన మృత్యువాత పడ్డారు. పరిస్థితి విషమిస్తుందని గమనించిన స్థానికులు క్వారీలపై దర్యాప్తు జరపాలని జిల్లా అధికారులకు ఫిర్యాదు చేసినా ఎటువంటి ప్రయోజనం లేకుండాపోయింది. తాజాగా లోకాయుక్తా ఫిర్యాదుకు సంబంధించిన నివేదికలోని దర్యాప్తు తూతూ మంత్రంగా సాగడం చూస్తే మార్టూరు క్వారీలపై కార్పొరేట్ స్థాయి శక్తులు ప్రభావితం చూపుతున్నాయని ఇట్టే అర్థమవుతుంది. అదే విధంగా మార్టూరుకు ఆనుకొని తుమ్మపాల రెవెన్యూ పరిధిలో ఏర్పాటు చేస్తున్న ఒక స్టోన్ క్రషర్‌పై కూడా అధికార పార్టీ నేతలే స్వయంగా ఫిర్యాదు చేయడం ఇక్కడి క్వారీ, స్టోన్ క్రషర్ స్థితిగతులను తేటతెల్లం చేస్తున్నాయి.     
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement