
మళ్లీ డుమ్మా కొట్టిన బాలరాజు
వరద ప్రాంతాల పర్యటన కోసం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పర్యటనకు మంత్రి బాలరాజు మళ్లీ డుమ్మా కొట్టారు.
విశాఖ : వరద ప్రాంతాల పర్యటన కోసం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పర్యటనకు మంత్రి బాలరాజు మళ్లీ డుమ్మా కొట్టారు. ముఖ్యమంత్రి గురువారం విశాఖ జిల్లాలో పర్యటిస్తున్నా.... కిరణ్ తనను పట్టించుకోవటం లేదనే ఆగ్రహంతో ఉన్న ఆయన రెండు రోజు కూడా పర్యటనకు దూరంగా ఉన్నారు. అంతేకాకుండా సమైక్యాంధ్ర ఉద్యమ నేపథ్యంలో అధిష్టానం వద్ద విధేయుడిగా ముద్ర పడేందుకే బాలరాజు ప్రాధాన్యత ఇచ్చినట్లు అయ్యింది.
జిల్లా పాలనా, రాజకీయ వ్యవహారాల్లో మంత్రి గంటా శ్రీనివాసరావు తనకు విలువ లేకుండా చేస్తున్నారని ...బాలరాజు చాలాకాలంగా కారాలు మిరియాలు నూరుతున్నారు. అంతేకాకుండా ఇద్దరు మంత్రులకు సమాన విలువ, ప్రాధాన్యత ఇవ్వాల్సిన ముఖ్యమంత్రి కూడా గంటాకు మాత్రమే పెద్దపీట వేస్తున్నారని పలుమార్లు బాలరాజు తన మనసులోని మాటను బయటపెట్టారు కూడా.
ఈ నేపథ్యంలో సమైక్యాంధ్ర ఉద్యమం రావటం సీఎంతో పాటు మంత్రి గంటా కూడా పార్టీ హైకమాండ్ నిర్ణయానికి విరుద్ధంగా వ్యవహరిస్తుండటాన్ని తాను అవకాశంగా మార్చుకోవడానికి ఆయన వ్యూహ రచన చేశారు. ఎవరు ఎటుపోయినా తాను మాత్రం పార్టీ హైకమాండ్ వద్ద విధేయుడిగా మార్కులు వేయించుకోని జిల్లా పార్టీలో చక్రం తిప్పేందుకు బాలరాజు పావులు కదుపుతున్నారు. సీఎంతో పాటు మంత్రి గంటాతో అమీతుమీ తేల్చుకోవడానికే సిద్ధం అయ్యారు. ఇందులో భాగంగానే ఈనెల 20న జరిగిన ముఖ్యమంత్రి పర్యటనకు బాలరాజు డుమ్మా కొట్టారు. అయితే సీఎం పర్యటనకు సంబంధించిన సమాచారం కూడా లేనందువల్లే హాజరు కాలేదని చెప్పుకోవటం విశేషం.