సొంత నియోజకవర్గంలో జరిగే రచ్చబండ కార్యక్రమం గురించి తనకు సమాచారం ఇవ్వకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసిన మంత్రి బాలరాజుతో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి గురువారం ఫోన్‌లో మాట్లాడారు.
సాక్షి, హైదరాబాద్: సొంత నియోజకవర్గంలో జరిగే రచ్చబండ కార్యక్రమం గురించి తనకు సమాచారం ఇవ్వకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసిన మంత్రి బాలరాజుతో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి గురువారం ఫోన్‌లో మాట్లాడారు. ఇటీవల విశాఖపట్నం జిల్లాలో తాను పాల్గొన్న రచ్చబండ కార్యక్రమ నేపథ్యంలో జరిగిన కొన్ని పరిణామాలపట్ల ముఖ్యమంత్రి విచారం వ్యక్తంచేశారు. సీఎం కార్యక్రమంపై సమాచారం,.. ఆ జిల్లా మంత్రి అయిన బాలరాజుకు తెలియకపోవడం, దీనితో మంత్రి మనస్తాపం చెందడం, తనను అవమానాలకు గురిచేశారంటూ ముఖ్యమంత్రి తీరును ఆయన తప్పుబట్టడం తెలిసిందే.
తాజాగా, కిరణ్‌కుమార్‌రెడ్డి గురువారం స్వయంగా బాలరాజుకు ఫోన్‌చేశారు. జరిగిన ఘటనలపై మంత్రికి సర్దిచెప్పారు. తన కార్యక్రమంపై అధికారులు సమాచారమిచ్చారనే తాను భావించానన్నారు. ప్రస్తుతం ఎక్కడ ఉన్నారని బాలరాజును సీఎం ప్రశ్నించగా, తన నియోజకవర్గంలో రచ్చబండ కార్యక్రమంలో ఉన్నానని బాలరాజు జవాబు చెప్పారు. తాను కూడా చిత్తూరు జిల్లాలో రచ్చబండలో ఉన్నానని, శుక్రవారం హైదరాబాద్‌కు వచ్చి తనను కలుసుకోవాలని బాలరాజుకు సీఎం సూచించారు.