
నాపై సర్కారు వివక్ష
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం నుంచి తాను వివక్షను ఎదుర్కొంటున్న ట్టు గిరిజన శాఖ మంత్రి బాలరాజు ఆవేదన వ్యక్తం చేశారు. శాఖాపరంగానూ, సంక్షేమ కార్యక్రమాల పరంగానూ కొం త వివక్షకు గురవుతున్నానన్న భావన బాధ కలిగిస్తున్నదన్నారు. సోమవారం హైదరాబాద్‌లోని మంత్రుల నివాస సముదాయంలోని క్లబ్‌హౌస్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. తన శాఖకు సంబంధించిన నిర్ణయాలన్నీ తన ప్రమేయం లేకుండానే జరుగుతున్నాయన్నారు. 7 (ఏ) క్లాజ్ ద్వారా ముఖ్యమంత్రికి ఉండే విస్తృత స్థాయి అధికారాలను ఉపయోగించుకొని నిర్ణయాలు తీసుకున్న సందర్భాలూ ఉన్నాయన్నారు.
ప్రభుత్వంలో తాను ఒక్కడినే గిరిజన మంత్రిని అయినప్పటికీ ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ ప్రచారంలోనూ వివక్షకు గురైనట్టు చెప్పారు. వివక్ష ముఖ్యమంత్రికి తెలిసే జరుగుతున్నదా, తెలియక జరుగుతున్నదా అన్నది తనకు తెలియదన్నారు. సీఎంకు అన్నీ తెలిసీ అధికారుల ద్వా రా ఇలాంటివి చేయిస్తుంటే ఈ ప్రభుత్వానికే చెడ్డపేరు రావడమేగాక, పార్టీకీ నష్టమని చెప్పారు. విశాఖపట్నంలో లా యూనివర్సిటీకి శంకుస్థాపన సందర్భం గా ప్రోటోకాల్ ఉల్లంఘన జరిగిన వివరాలను సీఎం కు చెప్పినా ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు. ఇటీవల రచ్చబండలో భాగంగా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి విశాఖపట్నం జిల్లా పర్యటనకు వెళ్లినప్పుడు సమాచా రం లేదనే కారణంతో బాలరాజు అందు లో పాల్గొనలేదు. ఈనెల 15వ తేదీన జరిగే ముఖ్యమంత్రి పర్యటన వివరాలు తన కు 14 సాయంత్రమే తెలిసిందన్నారు.
అప్పటికి మూడు రోజుల ముందు నుంచే ముఖ్యమంత్రి జిల్లా పర్యటన వివరాలు,సభలకు ఎవరు అధ్యక్షత వహిస్తారనే అంశాలపై జిల్లా పత్రికలన్నింటిలో కథనాలు ప్రచురితమయ్యాయన్నారు. సభకు అధ్యక్షత వహించే విషయంలో కొత్త సంప్రదాయాలకు తెరతీశారని బాలరాజు ఆరోపించారు.తనపై వివక్ష గురించి ముఖ్యమంత్రితోనూ మాట్లాడానని, అయినా న్యాయం జరగలేదని చెప్పారు. సీఎం విశాఖ జిల్లా పర్యటన వివరాలు తనకు ముందే తెలిపినట్టు సీఎం ఓ ఒక ప్రకటన విడుదల చేసిందని. ఒక్కరోజు ముందుమాత్రమే అని తాను చెబుతున్నానని, వాస్తవం ఏమిటో సీఎంఓ వెల్లడించాలన్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వమని, ఎవరూ సొంత ఆస్తిగా భావించాల్సిన అవసరం లేదన్నారు. తన నియోజకవర్గానికి సంబంధించి రూ. 63 కోట్ల అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన పనులు సీఎం పర్యటనలో ఉన్నాయని పేర్కొన్నారు.