సాక్షి, అమరావతి: రాష్ట్ర విభజనకు లేఖ ఇచ్చింది చంద్రబాబు కాదా.. అని మంత్రి బొత్స సత్యనారాయణ సూటిగా ప్రశ్నించారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత అన్ని ప్రాంతాల అభివృద్ధిని గత టీడీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని ధ్వజమెత్తారు. శివరామకృష్ణన్ కమిటీ నివేదికను పట్టించుకోకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని మండిపడ్డారు. సోమవారం ఆయన శాసనసభ సమావేశంలో మాట్లాడుతూ.. ప్రాంతీయ అసమానతలు, అవసరాల వల్లే రాష్ట్ర విభజన జరిగిందని.. గత పాలకుల నిర్ణయాల వల్ల ప్రాంతీయ అసమానతలు పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. అభివృద్ధి అంటే 5 కోట్ల మందికి జరగాలని, ఏ ఒక్కరికో..ఏ ఒక్క ప్రాంతానికో కాదన్నారు. హై పవర్ కమిటీ ద్వారా పూర్తిస్థాయిలో సమీక్ష జరిపామని.. వికేంద్రీకరణ వల్లే అన్ని ప్రాంతాల అభివృద్ధి సాధ్యం అని తెలిపారు.
వనరులన్నీ ఒకే ప్రాంతంలో కేంద్రీకృతం కాకూడదని. అందుకే సీఆర్‌డీఏ రద్దు చేయాలని నిర్ణయించామని వెల్లడించారు. ‘చంద్రబాబుకు జ్వరం వస్తే.. రాష్ట్రం మొత్తానికి జర్వం వస్తుంది. చంద్రబాబు బాగుంటే..రాష్ట్రం మొత్తం బాగున్నట్లా..’ అని ప్రశ్నించారు. టీడీపీ నేతల్లాగా దోచుకోవడం మాకు తెలియదని.. ఐదేళ్లలో చేయాల్సిన అభివృద్ధి పనులే మాకు తెలుసునని చెప్పారు. చరిత్రలో నిలిచిపోయే పనులు చేయడమే లక్ష్యమని పేర్కొన్నారు. రాష్ట్ర విభజకు మద్దతు ఇచ్చింది చంద్రబాబు కాదా.. మళ్లీ అటువంటి పరిస్థితులు తీసుకొస్తున్నారని ప్రశ్నించారు. విశాఖలో తన కుటుంబ సభ్యులపై భూములు ఉన్నట్లు నిరూపిస్తే దేనికైనా సిద్ధం అని బొత్స సత్యనారాయణ సవాల్ విసిరారు.
(చదవండి: రాజధాని రైతులకు వరాలు)
Comments
Please login to add a commentAdd a comment