‘ఇంటింటా తెలుగుదేశం’లో మంత్రి కాల‍్వకు చుక్కెదురు
సాక్షి, రాయదుర్గం : అనంతపురం జిల్లా రాయదుర్గంలో మంత్రి కాల్వ శ్రీనివాస్‌కు చేదు అనుభవం ఎదురైంది. ఏ ప్రభుత్వమూ చేయని విధంగా సంక్షేమ పథకాలు అమలు చేశామని, అభివృద్ధి పనులు చేపట్టామని, తమను ఆశీర్వదించాలని రాయదుర్గంలో సోమవారం చేపట్టిన ‘ఇంటింటా తెలుగుదేశం’లో ఆయనకు చుక్కెదురు అయింది.
ఏ ఇంటికెళ్లినా ప్రజలు సమస్యలను ఏకరువు పెట్టి మంత్రిని నిలదీశారు. మునిసిపల్ చైర్‌పర్సన్ ముదిగల్లు జ్యోతి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎనిమిదో వార్డులోని కృష్ణాశ్రమం వద్ద ‘ఇంటింటా తెలుగుదేశం’ కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ప్రసంగించారు. సమావేశం ముగియగానే మహిళలు శాంతమ్మ, లక్ష్మీదేవి లేచి ‘వార్డులో పర్యటించండి, అభివృద్ధి గురించి తెలుస్తుంది’ అని మంత్రితో అన్నారు. డ్రెయినేజీలపై ఆక్రమణల తొలగింపు నిబంధనలు సాధారణ ప్రజలకేనా.. టీడీపీ వారికి వర్తించవా అంటూ శాంతమ్మ ప్రశ్నించారు.
రోడ్లు , డ్రైనేజీలు లేక ఎక్కడికక్కడ ఆగిన మురుగు నీరు, అందులో పందుల స్వైర విహారం, దీంతో దుర్వాసనలో బతుకీడ్చుతున్నాం ఎవరూ పట్టించుకోవడం లేదని ఆరోపించారు. మంత్రి ఏ ఇంటికెళ్లినా అర్హత వున్నా పింఛన్ రాలేదని, ప్రభుత్వ ఇళ్లు, మరుగుదొడ్లు మంజూరు కాలేదని అర్హులైన నిరుపేదలు మొరపెట్టుకున్నారు. ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించకపోవడంతో పస్తులతో బతుకుబండి లాక్కొస్తున్నామని చేనేతలు వాపోయారు.
అలాగే 20 ఏళ్లుగా టీడీపీ కార్యకర్తగా పనిచేస్తున్నా సరైన గుర్తింపు లేదని రాజు అనే కార్యకర్త మంత్రిపై మండిపడ్డాడు. ‘సార్, నాకు ఓటు హక్కు వచ్చినప్పటి నుండి టీడీపీకే ఓటు వేశాను, అదే పార్టీలోనే వున్నాను. పూరి గుడిశెలో వుంటున్నా, మగ్గం ద్వారా కుటుంబాన్ని పోషించుకుంటున్నా. అయినా ఒక ఇల్లు మంజూరు కాలేదు, ప్రభుత్వం నుండి ఎలాంటి సహాయ, సహకారాలు లేవు. వార్డులోని ప్రజల సమస్యలను చైర్మన్ దృష్టికి తీసుకెళితే ఆమె పట్టించుకోవడం లేదు.
కనీసం బాడుగ వున్న ఇంటికి మరుగుదొడ్డి అయినా మంజూరు చేయమన్నా చేయలేదు. ఇన్ని రోజులు పార్టీ కార్యకర్తగా వున్నందుకు ఈ మేలు చాలు సార్ అంటూ’ దండం పెట్టాడు. ఇప్పుడు నీకేం కావాలి చెప్పు అని మంత్రి అడిగినా నాకు ఏమి వద్దు సార్ , ఇప్పటి వరకు పార్టీలో ఇచ్చిన మర్యాద చాలు అంటూ నిర్మొహమాటంగా చెప్పాడు.