సాక్షి, కాకినాడ: రైతు భరోసా సమస్యలను మూడు రోజుల్లో పరిష్కరించే విధంగా అధికారులు దృష్టి సారించాలని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు ఆదేశించారు. రైతు భరోసా పథకం పేర్లు నమోదుకు గడువు ముగుస్తున్న నేపథ్యంలో అధికారులతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. గిరిజన ప్రాంతాల్లో నెట్ వర్క్ సమస్యలు తమ దృష్టికి వచ్చాయని.. రైతుల డేటాను ఆన్‌లైన్‌లో కాకుండా ఆఫ్ లైన్‌లో తీసుకోవాలని అధికారులకు స్పష్టం చేశామని చెప్పారు. ఆర్టీజీఎస్‌కు ఆధార్ అనుసంధానంపై సత్వర చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
‘రైతు భరోసా పథకంలో లబ్ధిదారులు,అనర్హుల వివరాలు అన్ని గ్రామ సచివాలయాల్లో పెట్టాలని గతంలో ముఖ్యమంత్రి ఆదేశించారు. దూర ప్రాంతాల్లో ఉన్న రైతులు ఈ నెల 15లోపు నమోదు చేసుకోకపోతే..వచ్చే ఆర్థిక సంవత్సరంలోనే వారి వివరాలు పొందుపర్చుకోవాలని’ మంత్రి కన్నబాబు తెలిపారు. దేవాదాయ భూములను సాగు చేస్తున్న రైతులను సీసీఆర్పీగా గుర్తించి వారికి కూడా రైతు భరోసా అందించేలా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. క్షేత్రస్థాయిలో ఎక్కడైనా అనుమానాలు ఉంటే వెంటనే నివృతి చేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశామని మంత్రి కన్నబాబు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment