
‘నిజమే.. జరగరానిది జరిగింది’
- ‘ఏర్పేడు’ మృతుల కుటుంబాలతో మంత్రి నారా లోకేశ్
- మునగలపాలెంలో బాధితులకు పరామర్శ
- అంతా అయిపోయాక వచ్చారంటూ లోకేశ్‌ను నిలదీసిన మహిళ
సాక్షి ప్రతినిధి, తిరుపతి: ‘‘నిజమే.. జరగరానిది జరిగింది. ఘోరం జరిగిపోయింది. కారణాలేమైనా కావొచ్చు.. ఇకపై గ్రామాభివృద్ధి అవసరం. కలిసి కూర్చుందాం. అభివృద్ధిపై చర్చిద్దాం’’ అని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేశ్ మునగలపాలెం రైతులకు సూచించారు. చిత్తూరు జిల్లా ఏర్పేడులో జరిగిన లారీ ప్రమాదంలో మృతిచెందిన వారి కుటుంబాలను ఆయన పరామర్శించారు. శనివారం రాష్ట్ర మంత్రులు నారాయణ, అమరనాథ్‌రెడ్డి, జెడ్పీ ఛైర్‌పర్సన్ గీర్వాణి చంద్రప్రకాశ్‌లతో కలిసి మునగలపాలెంలో బాధిత కుటుంబాలను కలిశారు. చంద్రన్న బీమా, సీఎం రిలీఫ్‌ఫండ్ కింద మృతుల కుటుంబాలకు మంజూరు చేసిన రూ.10 లక్షల చెక్కులను అందజేశారు. దుర్ఘటనలో చనిపోయిన 12 మంది కుటుంబాలను మంత్రులు పరామర్శించారు. ఈ సందర్భంగా మంత్రి లోకేశ్ గ్రామస్తులతో మాట్లాడారు. ఇసుక దోపిడీని అరికట్టాలంటూ జిల్లా కలెక్టర్‌కు ప్రత్యేక ఆదేశాలు జారీ చేశాననీ, ఇకపై అలాంటిదేమీ ఉండబోదని హామీ ఇచ్చారు.
ఇప్పుడొచ్చి ఏం ప్రయోజనం?: ఈ సందర్భంగా గ్రామంలో శారద అనే మహిళ మంత్రి లోకేశ్‌ను మీడియా ముందే నిలదీసింది. ఇప్పుడొచ్చి ఏం ప్రయోజనం, అంతా అయిపోయాక... అంటూ అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇసుక దోపిడీపై ఎవరూ పట్టించుకోలేదని అంటుండగా మంత్రి లోకేశ్ జోక్యం చేసుకున్నారు. చర్యలు తీసుకోకపోతే అడగండి, కఠిన చర్యల తీసుకుంటాం. ఎవరినీ వదిలిపెట్టం అన్నారు. ఇప్పుడేమంటావ్.. రావద్దంటావా? అంటూ సదరు మహిళపై అసహనాన్ని ప్రదర్శించారు. తన ఉద్దేశం అది కాదని ఆమె చెప్పుకొచ్చింది. అమరావతిలో రోడ్లు వేయడం కాదు, కాస్త మా గురించి కూడా పట్టించుకోండి అని కోరింది. దీంతో మరింత అసహనానికి గురైన లోకేశ్ ఆ మహిళను ఏ ఊరు మీది అని ప్రశ్నించారు.