అమరావతిలో మంత్రి పి.నారాయణకు వినతి పత్రం అందజేస్తున్న కొండపి నియోజకవర్గ టీడీపీ నేతలు
సాక్షి ప్రతినిధి,ఒంగోలు: కొండపి టీడీపీలో అసంతృప్తి చిచ్చు మరింత రగులుకొంది. ఎమ్మెల్యే డోలా బాల వీరాంజనేయస్వామిని వచ్చే ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా నిలపరాదని, ఆయన స్థానంలో కొత్త్త అభ్యర్థిని ప్రకటించాలని ఎమ్మెల్యే వ్యతిరేక వర్గం డిమాండ్ చేస్తోంది. ఈ మేరకు సోమవారం కొండపి నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి 200 మంది కి పైగా అసంతృప్తి వాదులు అమరావతికి తరలి వెళ్లారు. జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి నారాయణ, జిల్లా మంత్రి శిద్దా రాఘవరావు, పార్టీ ఒంగోలు పార్లమెంట్ ఇన్‌ఛార్జ్ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్‌లను కలిసి ఎమ్మెల్యే స్వామిపై ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే స్వామి నియోజకవర్గంలోని సీనియర్ టీడీపీ నేతలను పక్కన బెట్టారని, సొంతవర్గాన్ని పెంచి పోషిస్తూ పార్టీని సర్వనాశనం చేశారని వారు మంత్రులకు వివరించారు. అభివృద్ధి పనులకు సంబంధించి నేతల పర్సంటేజీలు, అవినీతి వ్యవహారాలను సైతం స్థానిక నేతలు మంత్రులకు వివరించినట్లు తెలుస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ స్వామిని మార్చాల్సిందేనని తేల్చి చెప్పారు. అలా కాకుండా వచ్చే ఎన్నికల్లో ఆయనను తిరిగి అభ్యర్థిగా నిలిపితే తాము ఓట్లేసే ప్రసక్తే లేదని వ్యతిరేక వర్గం ముఖ్య నేతలకు తేల్చి చెప్పింది. అసంతృప్తి నేతల వాదనలు విన్న మంత్రులతో పాటు ఆలపాటి రాజేంద్రప్రసాద్ అన్ని విషయాలు ముఖ్యమంత్రికి తెలుసని, తాము కూడా మీ వాదనను సీఎం కు వివరిస్తామని చెప్పినట్లు సమాచారం. దీంతో కొండపి చిచ్చు టీడీపీలో పతాక స్థాయికి చేరింది.
జిల్లా టీడీపీలో ముదిరిన వర్గ పోరు:జిల్లా టీడీపీ నేతల మధ్య వర్గ పోరు నేపథ్యలోనే కొండపి వ్యవహారం రోడ్డున పడింది. టీడీపీ జిల్లా అధ్యక్షుడు దామచర్ల జనార్దన్ కొండపి ఎమ్మెల్యే బాలవీరాంజనేయస్వామికి మధ్య సఖ్యత లేదు. జనార్దన్ ఎమ్మెల్యేను తీవ్రంగా వ్యతిరేకిస్తుండగా ఆయన చిన్నాన్న కుటుంబం ఎమ్మెల్యేకు మద్దతుగా నిలిచింది. వీరి గొడవ కొండెపిలో మరింత చిచ్చు రేపింది. రాబోయే ఎన్నికల్లో కొండపి టీడీపీ అభ్యర్థిగా స్వామిని తప్పించి ఎస్సీ కార్పొరేషన్ ఛైర్మన్ జూపూడి ప్రభాకరరావును జనార్ధన్ ప్రతిపాదిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. దీనిని దామచర్ల సోదరుడు సత్య తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ విషయమై ఇప్పటికే ముఖ్యమంత్రి వద్ద పలుమార్లు పంచాయితీ సైతం జరిగినట్లు సమాచారం. ముఖ్యమంత్రి ఒక దశలో స్వామి అభ్యర్థిత్వానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే స్వామి వ్యతిరేకవర్గం వేగంగా పావులు కదుపుతున్నట్లు సమాచారం. ఇందులో బాగంగా ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా ఏకంగా అధిష్టానం వద్దే అమీతుమీ తేల్చుకోవాలని నిర్ణయించిన అసంతృప్తి నేతలు సోమవారం రాజధానిలోనే ఎమ్మెల్యే పై పిర్యాదుకు దిగినట్లు తెలుస్తోంది. దీంతో కొండపి రగడ మరోమారు రోడ్డెక్కింది.
ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా సోమవారం అమరావతికి వెళ్లిన వారిలో చింతల వెంకటేశ్వర్లు, కంచర్ల ప్రసాద్, చుక్క కిరణ్‌కుమార్,ç Üలీం భాషా, బ్రహ్మయ్య, పోటు శ్రీనివాసరావు,కొమ్మాలపాటి రాఘవ, రమేష్, బాలకృష్ణ, మారెడ్డి సుబ్బారెడ్డి, చెరుకూరి కృష్ణారావు, సింగయ్య, ఎంపీటీసీలు రామారావు, వెంకటేశ్వర్లు, చెన్నయ్య, మహబాషా, రామకృష్ణతో పాటు పలువురు ఉన్నారు. వీరంతా 20 వాహనాల్లో అమరావతి తరలి వెళ్లారు.
Comments
Please login to add a commentAdd a comment