
పెట్రోల్ బంకులు తనిఖీ చేసిన మంత్రి సునీత
అనంతపపురం (ధర్మవరం టౌన్) : అనంతపురం జిల్లా ధర్మవరంలోని పలు పెట్రోల్ బంకులను రాష్ట్ర పౌర సరఫరాల మంత్రి పరిటాల సునీత ఆకస్మికంగా తనిఖీ చేశారు. బుధవారం శివానగర్, గాంధీనగర్, దుర్గమ్మ గుడి వద్ద ఉన్న హెచ్‌పీ పెట్రోల్ బంకులను అధికారులతో కలిసి పరిశీలించారు. దుర్గమ్మ గుడి వద్ద ఉన్న బంకులోని డీజిల్‌లో కల్తీ ఉన్నట్లు వెల్లడి కావడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ తక్షణం బంక్‌ను సీజ్ చేయాలని అధికారులను ఆదేశించారు.
యంత్రాలకు సీల్ లేకుండా మోసాలకు పాల్పడుతుంటే అధికారులు ఏం చేస్తున్నారని మంత్రి సునీత మండిపడ్డారు. ప్రజలను మోసం చేసే ఇలాంటి చర్యలను ఉపేక్షించేది లేదని ఆమె హెచ్చరించారు. నాణ్యమైన ఇంధనాన్ని వినియోగదారులకు సరఫరా చేయాలని బంకుల నిర్వాహకులకు సూచించారు. మంత్రి వెంట ఆర్డీవో నాగరాజు, డీఎస్పీ వేణుగోపాల్, తహశీల్దార్ విజయకుమారి, పట్టణ సీఐ విజయ్‌భాస్కర్ గౌడ్, తూనికలు కొలతల అధికారి వై.వి.శంకర్ తదితరులు ఉన్నారు.