అధికారులపై మంత్రి అసహనం
సమన్వయంతో పనిచేయాలని ఆదేశం
సూపరింటెండెంట్‌పై కలెక్టర్ ఆగ్రహం
సర్వజనాస్పత్రిలో సమీక్షా సమావేశం
అనంతపురం మెడికల్: నగరంలోని ప్రభుత్వ సర్వజనాస్పత్రి అధికారులపై మంత్రి పల్లె రఘునాథరెడ్డి, ఎంపీ దివాకర్‌రెడ్డి, కలెక్టర్ సొలమన్ ఆరోగ్యరాజ్ అసహనం వ్యక్తం చేశారు. ఆస్పత్రిలో సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. సూపరింటెండెంట్, హెచ్‌ఓడీలు పాల్గొన్నారు. మంత్రి మాట్లాడుతూ వైద్యులు..మేధావులు, విద్యావంతులైన మీ మధ్య సమన్వయ లోపమెందుకని ప్రశ్నించారు. ఆస్పత్రిలో మౌలిక సదుపాయాల విషయం తన దృష్టికి ఎందుకు తీసుకురాలేదని నిలదీశారు. ఆస్పత్రి అభివృద్ధి కోసం కలసికట్టుగా పనిచేయాలని ఆదేశించారు. ఆస్పత్రిలో పారిశుద్ధ్య పరిస్థితి అధ్వానంగా ఉందన్నారు.
ఎంపీ మాట్లాడుతూ పరిశుభ్రత లేనికారణంగానే రోగులు ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్తున్నారన్నారు. పారిశుద్ధ్య పనులు సక్రమంగా నిర్వహిస్తున్నారా? అని ఆర్‌ఎంఓతో ఆరా తీశారు. సానిటేషన్ పనులు సక్రమంగా చేయాలని కాంట్రాక్టర్‌ను ఎంపీ ఆదేశించారు. చేతకాకపోతే మానుకోవాలన్నారు. వైద్యుల కొరత ఉందని, సూపర్ స్పెషాలిటీ వైద్యులు ఒక్కరూ లేరని మంత్రి అడిగిన ప్రశ్నకు సూపరింటెండెంట్ వెంకటేశ్వరరావు సమాధానంగా చెప్పారు. ఎంపీ జేసీ కలుగజేసుకుని సూపర్ స్పెషాలిటీ వైద్యులను ఏర్పాటు చేసే బాధ్యత మంత్రి తీసుకోవాలని కోరారు. అందుకు ఈ నెల 15న జరిగే కేబినెట్‌లో మాట్లాడుతామన్నారు. సమావేశంలో మేయర్ స్వరూప, హెచ్‌ఓడీలు సంపత్ కుమార్, మల్లేశ్వరి, యండ్లూరీ ప్రభాకర్, రామస్వా మి నాయక్, జేసీ రెడ్డి, నవీన్, పెంచలయ్య, సంధ్య, రాధారాణి తదితరులు పాల్గొన్నారు.
సూపరింటెండెంట్‌పై కలెక్టర్ ఆగ్రహం
‘హెచ్‌డీఎస్ సమావేశం జరిగినప్పటి నుంచి మూడుసార్లు నాతో సమావేశమయ్యారు.. కానీ ఎందుకు పనులు పూర్తి కాలేదు.. కనీసం ఈ సమస్య ఉందని ఎందుకు తెలుపలేదు..’ అని సూపరింటెండెంట్‌పై కలెక్టర్ మండిపడ్డారు. వాషింగ్ మిషన్, సీసీ కెమెరాలు ఏర్పాటుకు ఆరోగ్యశ్రీ నిధుల నుంచి వాడాలని చెప్పినా ఎందుకు పట్టించుకోలేదన్నారు. కొటేషన్ వేస్తున్నామని సూపరింటెండెంట్ సమాధానం ఇచ్చారు. ప్రతిరోజూ సిబ్బందితో మాట్లాడి పర్యవేక్షించాలని సూచిం చారు. సమావేశం అనంతరం కలెక్టర్ సీరియస్‌గా వెళ్లిపోయారు.