కుడి కాలువపై మంత్రి శిద్దా పర్యటన
► ప్రకాశం జిల్లాకు తాగునీరు సక్రమంగా అందేలా చర్యలు
► అంగలూరు మేజర్‌పై షట్టర్లు దింపించిన మంత్రి
ఈపూరు: నాగార్జునసాగర్ కుడి ప్రధాన కాలువ ద్వారా ప్రకాశం జిల్లాకు విడుదల చేసిన తాగునీరు సక్రమంగా వస్తుందా లేదా అని పరిశీలించేందుకు ఎమ్మెల్యేలతో కలిసి రోడ్లు భవనాల శాఖ మంత్రి శిద్దా రాఘవరావు శుక్రవారం కాలువ మీద పర్యటించారు. గుంటూరు జిల్లా చేజర్ల నుంచి ప్రకాశం జిల్లా త్రిపురాంతకం వరకు వీరు కాలువలపై పర్యవేక్షించారు. ఈపూరు మండలంలోని అంగలూరు మేజర్ వద ్ద గురువారం రైతులు విడుదల చేసిన నీటిని ఆయన దగ్గర ఉండి నిలిపి వేయించారు.
అనంతరం మంత్రి రాఘవరావు విలేకరులతో మాట్లాడుతూ తాగునీరు లేక ప్రకాశం జిల్లా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, నీరు సక్రమంగా అందేందుకు చర్యలు చేపట్టి కాలువలపై పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. ప్రకాశం జిల్లా ఎమ్మెల్యేలు దామరచర్ల జనార్ధన్, పాలపర్తి డేవిడ్‌రాజు, కరణం బలరాం, జాయింట్ కలెక్టర్ జవహర్‌బాబు, ఆర్డీవో శ్రీనివాసరావు తదితరులు మంత్రితో పాటు ఉన్నారు.
అద్దంకి బ్రాంచ్ కెనాల్‌పై సీఈ పర్యటన
మండల పరిధిలోని అద్దంకి బ్రాంచ్ కెనాల్‌పై సీఈ వీర్రాజ్ శుక్రవారం పర్యటించారు. కాలువలో నీరు ఎంత పరిమాణంలో వస్తుంది, నీరు సక్రమంగా చేరుతుందా లేదా అక్రమంగా ఎవరైనా వినియోగిస్తున్నారా అని కిందిస్థాయి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట ఎన్‌ఎస్పీ సిబ్బంది ఉన్నారు.
చురుగ్గా సాగర్ కుడి కాలువ నిర్మాణ పనులు
శావల్యాపురం: నాగార్జునసాగర్ కుడి ప్రధాన కాల్వ లైనింగ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ప్రపంచ బ్యాంకు నిధులతో ప్రధాన కాలువ చేజర్ల 0మైలు రాయి నుంచి అడవిపాలెం 28వ మైలురాయి వరకు మట్టి పనులు శరవేగంగా చేస్తున్నారు. మండలంలోని వేల్పూరు, వెలమవారిపాలెం, గంటావారిపాలెం, కారుమంచి గ్రామాల మీదుగా ఈ కాల్వ వెళ్తుంది. ఆధునిక యంత్రాలతో కాలువలో పూడికతీత తీస్తున్నారు.
కాలువకు ఇరువైపులా కట్టలు బలంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. మండలంలోని పోట్లూరులోని ప్రత్యేక క్యారీ ద్వారా ఎరుపు రంగు మట్టిని పోస్తున్నారు. దానికి కాలువ వెడల్పు పెంచుతున్నారు. గ్రావెల్ పనులు కాలువకు ఇరువైపులా, కాలువ కింద కూడా సిమెంటు లైనింగ్ పనులు చేస్తున్నారు. సాగునీరు వృథా కాకుండా చివరి భూములకు నీరందేలా ప్రణాళిక ప్రకారం ఆధునికీకరణ పనులు చేస్తున్నారు. కాలువ పనులు పూర్తిస్థాయిలో జరిగితే భవిష్యత్తులో సాగునీటి సమస్యలు తగ్గుతాయని రైతులు అంటున్నారు.ప్రస్తుతం పనులపై అధికారుల పర్యవేక్షణ కొరవడింది.