సాగనంపుతారా?
► మంత్రి నారాయణకు 18వ ర్యాంక్
► ర్యాంకుల జాబితాలో ఇన్చార్జ్ మంత్రి శిద్దాకు దక్కని చోటు
► నారాయణ వర్గంలో ఆందోళన... . మరో వర్గంలో సంబరాలు
సాక్షి ప్రతినిధి, నెల్లూరు : రాష్ట్ర మున్సిపల్‌శాఖ మంత్రి నారాయణ... జిల్లా ఇన్చార్జ్ మంత్రి శిద్దా రాఘవరావు పదవులు డేంజర్లో పడ్డాయా? రాజధాని నుంచి అందిన సమాచారం మేరకు అవుననే అంటున్నాయి. దీంతో జిల్లా టీడీపీలో ఓ వర్గం ఆందోళన చెందుతుంటే... మరో వర్గం మాత్రం సంతోషంగా ఉన్నట్లు సమాచారం. ముఖ్యమంత్రి చంద్రబాబు పేషీ నుంచి సోమవారం మంత్రులు ర్యాంకులు ప్రకటించారు. మంత్రుల పనితీరును బట్టి ఈ ర్యాంకులను ప్రకటించినట్లు వెళ్లడించింది. ర్యాంకుల జాబితాలో జిల్లాకు చెందిన మంత్రి పొంగూరు నారాయణ 18వ ర్యాంకుకు పడిపోయారు. అయితే మంత్రి నారాయణ పేషీ నుంచి ర్యాంకుల్లో మార్పులు ఉంటాయని చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే జిల్లా ఇన్చార్జ్ మంత్రి శిద్దా రాఘవరావు అయితే ర్యాంకుల జాబితాలోనే లేరు. సీఎం పేషీ నుంచి వచ్చిన ర్యాంకుల జాబితాను బట్టి ఈ ఇద్దరు మంత్రులు పనితీరు అసలు బాగోలేదని తేలిపోయింది. దీంతో వచ్చే మంత్రి వర్గ విస్తరణలో మంత్రులు నారాయణ, శిద్దారాఘవరావులకు ఉద్వాసన పలుకుతారనే ప్రచారం జరుగుతోంది.
మున్సిపాలిటీల అభివృద్ధే ప్రామాణికంగా:
రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు తరువాత నారాయణ మాటకే చెల్లుబాటు అవుతోందనే ప్రచారం ఉంది. మంత్రి వర్గంలో రెండో స్థానంలో నారాయణ సొంత జిల్లాలో అభివృద్ధి జాడ కనిపించలేదనే విమర్శలు ఉన్నాయి. జిల్లాలో నెల్లూరు కార్పొరేషన్, ఆత్మకూరు, కావలి, గూడూరు, నాయుడుపేట, సూళ్లూరుపేట, వెంకటగిరి మున్సిపాలిటీలు ఉన్నాయి. వీటిలో ఎక్కడి సమస్యలు అక్కడే తిష్టవేసి ఉన్నాయి. నెల్లూరు కార్పొరేషన్లో మంచినీటి సమస్య, మురికి కాలువలు, రోడ్ల సమస్య తీవ్రంగా ఉన్నాయి. దోమల బెడద రోజు రోజుకు తీవ్రం అవుతోంది. నెల్లూరు నగరంలో నివాసం నరకంగా మారింది. జనం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ప్రతికలు, మీడియా కథనాల ద్వారా హెచ్చరించినా... సమస్య పరిష్కరించిన పాపాన పోలేదు. ఇదిలా ఉంటే నవంబర్‌లో కురిసిన వర్షాలకు నెల్లూరు నగరం మునకకు గురైంది. నగరవాసులు వారం పదిరోజుల వరకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
ప్రధానంగా నెల్లూరు నగరం మునకకు గురికావటానికి కాలువల ఆక్రమణలేనని తేలింది. సీఎం చంద్ర బాబు పర్యటించిన సమయంలో ఆక్రమణలకు గురైన కాలువలను పునరుద్ధరిస్తామని, కాలువను ఆక్రమించుకున్న వారు ఎంతటి వారైనా విడిచిపెట్టే సమస్యేలేదని ప్రకటించారు. ఆ తరువాత రెండు రోజులు మంత్రి నారాయణ నగరంలోని తిష్టవేసి హడావుడి చేశారు. ఆ తరువాత వదిలేశారు. అదే విధంగా జిల్లాలోని ఆరు మున్సిపాలిటీల్లో సమస్యలు తిష్టవేసి ఉన్నాయి.
తాగునీరు, మురుగు కాలువలు, రహదారులు వంటి సమస్యలతో సతమతమవుతున్నారు. జనం నుంచి పన్నులు వసూళ్లు చేస్తున్నారే గానీ.. అభివృద్ది విషయంలో ఆ శ్రద్ధ కనిపించలేదనే ఆరోపణలు ఉన్నాయి. మంత్రి నారాయణ సొంత జిల్లాలోనే ఇలా ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్‌లోనూ సమస్యలు ఉండ టం వల్లే ఆయనకు చివరి స్థానానికి పడిపోయారని చెపుతున్నారు. ఇకపోతే శిద్దారాఘవరావు జిల్లా ఇన్చార్జ్ మంత్రిగా నియమించినప్పటి నుంచి నెల్లూరుకు జరిగిన మేలేమీ లేదని ఆరోపణలు ఉన్నాయి. అందుకే మంత్రి శిద్దా రాఘవరావు ర్యాంకుల జాబితాలోనే లేకపోవటం గమనార్హం.