సాక్షి, పాలకొల్లు: డెంగీ నివారణకు తక్షణ చర్యలు చేపట్టాలని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథ్ రాజు అధికారులను ఆదేశించారు. సోమవారం మంత్రి పాలకొల్లు పట్టణంలోని పలు వార్డుల్లో పర్యటించి పారిశుద్ధ్య చర్యలను పరిశీలించారు. పట్టణంలో పారిశుద్ధ్య నిర్వహణ గురించి మున్సిపల్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. పారిశుద్ధ్యంపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోన్న మున్సిపల్ హెల్త్ అసిస్టెంట్ కుమార్ రాజును సస్పెండ్ చేయాలని అధికారులను ఆదేశించారు.
పాలకొల్లు ప్రధాన మురుగు కాలువ పూడికతీత పనులు వేగవంతం చేయాలన్నారు. అవసరమైతే ప్రైవేట్ వాహనాల ద్వారా యుద్ధ ప్రాతిపదికన మూడు రోజుల్లో పూడికతీత పూర్తి చేయాలన్నారు. పట్టణంలో ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి వైద్య సేవలు అందించాలని జిల్లా వైద్యాధికారులను ఆదేశించారు. ఇటీవల విష జ్వరాల బారిన పడి మృతిచెందిన వారి కుటుంబాలకు ముఖ్యమంత్రితో మాట్లాడి సాయం అందేలా చేస్తామని తెలిపారు. మంత్రి వెంట వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ ఇంఛార్జ్ కవురు శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్సీ మేకా శేషుబాబు, యడ్ల తాతాజీ తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment