ఆళ్ల నాని, పుప్పాల వాసుబాబు, శ్రీరంగనాథరాజ, జీఎస్ రావు
సాక్షి, కొవ్వూరు : జిల్లాలో రాజకీయంగా చక్రం తిప్పిన నేతలకు, పలువురు ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులుగా చలామణిలో ఉన్న వారికి అసలు పేరు కంటే నిక్ నేమ్స్, ముద్దుపేర్లే బాగా ప్రాచూర్యం పొందాయి. నాని.. బాబు.. బుజ్జి వంటి పేర్లు కలిగిన నాయకులు ప్రస్తుతం జిల్లాలో ఎమ్మెల్యే, ఎంపీ స్థానాలకు పోటీలో ఉన్నారు. కొందరు పొడవాటి పేర్లు కలిగిన నాయకులను చిన్నపేర్లు పెట్టి పిలవడం పరిపాటి. ఇలా ఆ పేర్లే ఎక్కువగా వాడుకలోకి వచ్చాయి. కొందరికైతే అసలు పేరు కంటే ముద్దుపేర్లు చెబితే గాని తెలియని పరిస్ధితి ఉంది.
- ఏలూరుకి చెందిన వైఎస్సార్ సీపీ నేత, ఎమ్మెల్సీ ఆళ్ల నాని పూర్తి పేరు కాళీకృష్ణ శ్రీనివాస్. అయినా జిల్లా వాసులకు ఆయన నానిగానే సుపరిచితులు.
- ఏలూరు మాజీ ఎంపీ మాగంటి బాబు పూర్తి పేరు వెంకటేశ్వరరావు. జిల్లా నాయకులతోపాటు రాష్ట్ర పార్టీ నాయకులంతా ఆయన్ను బాబుగానే పిలుస్తుంటారు. పూర్తి పేరు కొద్ది మందికి మాత్రమే తెలుసు.
- తాడేపల్లిగూడెం మాజీ ఎమ్మెల్యే ఈలి నాని పూర్తి పేరు ఈలి వెంకట మధుసూదనరావు. నాని అనే పేరు ఎక్కువగా వాడుకలో ఉంది.
- మాజీ రాజ్యసభ సభ్యుడు యర్రా నారాయణస్వామి జిల్లావాసులకు సుపరితులు. ఆయన్ను బెనర్జీగా పిలుస్తుంటారు.
- అత్తిలి మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుతం ఆచంట వైఎస్సాఆర్ సీపీ సమన్వయకర్త చెరుకువాడ రంగరాజు పూర్తిపేరు శ్రీరంగనాథరాజు. సన్నిహితులు రంగరాజుగా పిలుస్తుంటారు.
- ఉండి నియోజకవర్గానికి చెందిన మాజీ మంత్రి కలిదిండి రామచంద్రరాజును ఎక్కువ మంది అబ్బాయిరాజుగా పిలుస్తుంటారు.
- వైఎస్సార్ సీపీ నేత, కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే పెండ్యాల వెంకట కృష్ణారావును ఈ ప్రాంత వాసులు కృష్ణబాబుగా పిలుస్తుంటారు.
- పీసీసీ మాజీ అధ్యక్షుడు జీఎస్ రావు రాష్ట్ర ప్రజలందరికీ సుపరిచితుడు. ఆయన పూర్తి పేరు మాత్రం గెడ్డం సూర్యారావు.
- డీసీసీ మాజీ అధ్యక్షుడు గోకరాజు రామరాజును సన్నిహితులంతా రామంగా పిలుస్తుంటారు.
- మాజీ ఎంపీ కనుమూరి బాపిరాజును సన్నిహితులు మీసాల బాపిరాజుగా పిలుస్తారు.
- భీమవరం మాజీ ఎమ్మెల్యే పీవీఎల్ నరసింహరాజును యండగండి నరసింహరాజుగా పిలుస్తారు.
- ఉంగుటూరు వైఎస్సార్ సీపీ సమన్వయకర్త వుప్పాల శ్రీనివాసరావుని వాసుబాబుగా పిలుస్తారు. జిల్లా వాసులందరికీ వాసుబాబుగానే సుపరిచితులు.
Comments
Please login to add a commentAdd a comment