సాక్షి, హన్మకొండ: 2014 బాలల దినోత్సవం నాటికి సైన్స్ సెంటర్‌ని ప్రారంభిస్తామని అధికారుల చెప్పిన మాటలు మరోసారి నీటి మూటలుగానే మిగిలిపోయాయి. విద్యార్థులకు సైన్స్ సందేహాలు తీర్చి వారిని భావి శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ఉపయోగపడే సైన్స్‌సెంటర్ ప్రారంభానికి నోచుకోవడం లేదు. చిన్న అభివృద్ధి కార్యక్రమాలకు హడావుడి చేసే మంత్రులు.. ప్రతిష్టాత్మకమైన సైన్స్‌సెంటర్ వైపు మాత్రం కన్నెత్తి కూడా చూడడం లేదు. వరంగల్ నగరంలోని హంటర్‌రోడ్డులో రీజనల్ సైన్స్ సెంటర్ భవన నిర్మాణం పూర్తయి మూడేళ్లు అవుతోంది. కాకతీయ ఉత్సవాల సందర్భంగా గతేడాది డిసెంబర్‌లో నగరానికి వస్తున్న ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి చేతుల మీదుగా సైన్స్‌సెంటర్‌ను ప్రారంభించాలని అధికారులు సంకల్పించారు. అందుకుతగ్గట్టుగా పనుల్లో వేగం పెంచారు.
అంతే వేగంగా అరవై లక్షల రూపాయలతో సైన్స్ ఎగ్జిబిట్లు తెప్పించారు. అయితే చివరి నిమిషంలో ఆ కార్యక్రమాన్ని వాయిదా వేశారు. ఈ ఏడాది మార్చి నాటికి భవన నిర్మాణంతోపాటు ఎగ్జిబిట్లు ఏర్పాటు చేయడం కూడా పూర్తయింది. అయినా జిల్లాకు చెందిన మంత్రులు కానీ, అధికారులుగానీ పట్టించుకోవడం లేదు. చివరికి సెప్టెంబర్ జరిగిన సమీక్షా సమావేశంలో కలెక్టర్ జి.కిషన్ స్పందించారు. నవంబర్ 14నాటికి మిగిలిన పనులు పూర్తిచేసి సైన్స్‌సెంటర్‌ను సిద్ధం చేయాలని ఆదేశించారు.
మిగిలిన పనులు సాగుతూనే..
నవంబర్ 14 రానే వచ్చింది. అయినా మిగిలిన పనులు ఇంకా నడుస్తూనే ఉన్నాయి. ప్రధాన పనులు పూర్తయినా లిఫ్ట్‌ల ఏర్పాటు, వాహనాల పార్కింగ్, లాన్, ల్యాండ్‌స్కేప్, టాయిలెట్లు, ఆర్చ్,సెక్యూరిటీ సెల్ నిర్మాణ పనులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. మరోవైపు ఏళ్లతరబడి నిర్మాణ పనులు జరుగుతుండడం వల్ల భవనానికి వేసిన రంగులు వెలిసిపోతున్నాయి. ఎలక్ట్రికల్ వైరింగ్, ఏసీ తదితరాలు పాడవుతున్నాయి.
పాతికేళ్ల కల
ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 1986లో ఏకకాలంలో ప్రాంతాల వారీగా తిరుపతి, విజయవాడ, వరంగల్‌లో మూడు రీజనల్ సైన్స్‌సెంటర్లను మంజూరు చేశారు. అయితే 1999 వరకు ఎవరూ ఈ సెంటర్ గురించి పట్టించుకున్న పాపాన పోలేదు. ఎట్టకేలకు 1999లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబునాయుడు నిర్మాణం కోసం శిలాఫలకం వేశారు తప్పితే నిధులు కేటాయించలేదు. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో 2008లో ఈ సెంటర్ నిర్మాణం కోసం రూ. 5.87 కోట్లు కేటాయించారు.
ఆయన అకాల మరణం తర్వాత పనుల్లో వేగం మందగించింది. మొత్తానికి పాతికేళ్ల నుంచి పడుతూ లేస్తూ ముందుకు సాగుతోంది. ఇంకోవైపు తిరుపతి, విజయవాడ రీజనల్ సైన్స్ సెంటర్లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి.
బాలలకు అందుబాటులో విజ్ఞానం
మూడు అంతస్తుల సైన్స్ సెంటర్ ప్రాంగణంలో ప్రతీ అంతస్తులో శాస్త్రసాంకేతిక రంగాలకు సంబంధించిన ఎగ్జిబిట్లు ఏర్పాటు చేశారు. ఏడు విశాలమైన హాళ్లతో కూడిన ప్రధాన భవనంలో.. మొదటి రెండు హాళ్లలో ఫిజికల్ సైన్స్ ఎగ్జిబిట్లు ఏర్పాటు చేశారు. మిగితా వాటిలో వరుసగా స్పేస్‌సైన్స్, సోలార్ పవర్, 5డి థియేటర్, ఎన్విరాన్‌మెంటల్ పొల్యూషన్‌లతో పాటు మానవ శరీర నిర్మాణ శాస్త్రానికి సంబంధించిన నమూనాలు ఉన్నాయి. ఎడ్యుకేషన్ త్రూ శాటిలైట్ హాల్ కూడా ఉంది.
పాతికేళ్ల కలకు గ్రహణం
Published Thu, Nov 14 2013 3:47 AM | Last Updated on Sat, Sep 2 2017 12:34 AM
Advertisement
Advertisement