మిర్చి మంట | Mirchi farmers agitation for Support price | Sakshi
Sakshi News home page

మిర్చి మంట

Published Sat, May 6 2017 1:51 AM | Last Updated on Tue, Aug 21 2018 4:40 PM

మిర్చి మంట - Sakshi

మిర్చి మంట

ఆగని ధరల పతనం.. సర్కారు మీనమేషాలు

మిరప రైతు కడుపు రగిలిపోతోంది. ఏ అన్నదాతను కదిలించినా ఒకటే ఆవేదన.. సాయం చేస్తుందనుకున్న సర్కారే.. వ్యాపారులను మించిన లెక్కలు వేస్తోంది. నిల్వ చేసేందుకు కోల్డ్‌ స్టోరేజీలు అందుబాటులో లేక అయినకాడికి సరుకును తెగనమ్ముకోవాల్సిన దుస్థితి దాపురించింది. మిర్చి యార్డులో ఖాళీ లేక, ఆరుబయట నిల్వ ఉంచితే అకాల వర్ష భయం రైతన్న గుండెను తొలిచేస్తోంది.

సాక్షి, అమరావతి బ్యూరో: సరుకును ఇంట్లో ఉంచుకోలేక, మార్కెట్‌ యార్డుకు తెచ్చి వ్యాపారులు అడిగిన ధరకు అమ్మలేక మిర్చి రైతులు అయోమయంతో తల్లడిల్లిపోతున్నారు. మిర్చిని ఇంట్లో ఉంచితే వేడికి రంగు మారుతుందని, కల్లాల్లో ఉంచితే వర్షం వస్తే తడిసి పోతుందనే బెంగ రైతన్నను పట్టిపీడిస్తోంది. నిల్వ ఉంచుకునేందుకు కోల్డ్‌ స్టోరేజిలు అందుబాటులో లేవు. దీంతో విధిలేని పరిస్థితుల్లో రైతులు మార్కెట్‌ యార్డుకు సరుకు తీసుకొస్తే.. వ్యాపారులు, మార్కెటింగ్‌ పాలక వర్గం చుక్కలు చూపుతోంది. సరుకు అమ్ముకునేందుకు రోజుల తరబడి పడిగాపులు కాయాల్సి వస్తోంది.  సరుకు నిల్వ అధికంగా ఉందనే సాకు చూపి వ్యాపారులు ధరలు పడిపోయేలా చేస్తున్నారు.

ఆదుకోవాల్సిన ప్రభుత్వం నామ మాత్రంగా చర్యలు చేపట్టి చేతులు దులుపుకుంటోంది. ‘కాయలు పాడయిపోతున్నాయయ్యా.. ఇంట్లో ఉంచితే రంగు మారుతున్నాయి.. కల్లాల్లో ఉంచితే వర్షం వస్తే తడిసిపోతాయి.. తేజ మేలు రకం కాయలు మొదటి కోతయ్యా.. ఇంతకు మునుపు క్వింటాలు రూ.6000 కు అడిగితే ఇవ్వలేదు. ప్రభుత్వ బోనస్‌ వస్తుందని ఇక్కడకు తెస్తే, ఇక్కడ క్వింటా రూ.3500 – 4000కు మించి కొనుగోలు చేయడం లేదు. మీరే న్యాయం చేయండి’ అంటూ గుంటూరు మార్కెట్‌ యార్డులో శుక్రవారం ఉదయం మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఎదుట పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

యార్డులో 7 లక్షల టిక్కీల సరుకు....
రాష్ట్రంలో ప్రస్తుతం అమలులో ఉన్న రైతుకు 20 క్వింటాలు, క్వింటాకు రూ.1500 బోనస్‌ ప«థకమే కొనసాగుతోంది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన క్వింటాలుకు రూ.5000 గురించి ఆలోచించడం లేదు. రైతులు అందోళన చెందాల్సిన పని లేదని, జూలై చివరి వరకు మిర్చిని కొనుగోలు చేస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు గుంటూరు మిర్చి యార్డులో శుక్రవారం ఉదయం స్పష్టం చేశారు. కొనుగోలు చేసిన సరుకును ఇక్కడే ఉంచి పెద్ద ఎత్తున నిల్వ ఉన్నట్లు వ్యాపారులు, మార్కెటింగ్‌ సిబ్బంది కుమ్మక్కై ధరలు తగ్గించి అడుగుతున్నారు. దీంతో శుక్రవారం వచ్చిన 3.5 లక్షల టిక్కీలు, బయట 3.5 లక్షల టిక్కీలు.. మొత్తం 7 లక్షల టిక్కీల సరుకు ఉన్నట్లు సమాచారం. యార్డు మిర్చి బస్తాలతో నిండిపోయింది. సోమవారం మళ్లీ సరుకు అదనంగా వస్తే తిప్పలు తప్పవు.

రూ.3 వేలకు కూడా కొనడం లేదు
నేను మిర్చి యార్డుకు ఐదు క్వింటాళ్ల మిర్చిని తీసుకొచ్చా. ‘రాయితీ పథకం కింద వద్దు.. మామూ లుగా సరుకు అమ్ముకొని పో.. లేదంటే రెండు నెలల వరకు డబ్బులు రావు’ అని వ్యాపారులు చెబుతున్నారు. ‘తేజ’ రెండో కోత కాయలు క్వింటాలు రూ.3000కు కూడా అడగటం లేదు. ఇలాగైతే రైతుల గతేంటి?
– బెల్లం అంజనేయలు, చీమకుర్తి

రవాణా ఖర్చులూ రావట్లేదు
మొన్నటి వరకు క్వింటాలు రూ.4000 – 5000 అమ్మిన మిర్చి.. ఇప్పుడు రూ.1500 – 2000కు కూడా అడగటం లేదు. రైతు పరిస్థితి దారుణంగా మారింది. ఆదుకునే నాథుడే లేరు. కోత కూలీల మాట దేవుడెరుగు.. కనీసం రవాణా ఖర్చులూ వచ్చే పరిస్థితి లేదు.
– కేతవత్‌ గాసిరాం, హసన్‌బాద్‌ తాండ, మాచర్ల

ఐదు కేంద్రాల్లో మిర్చి కొనుగోళ్లు
శని, ఆదివారాల్లో గుంటూరు జిల్లా నడికుడి, వినుకొండ, కృష్ణా జిల్లా నందిగామ, కర్నూలు, ఒంగోలులో మిర్చి కొనుగోలు చేస్తామని మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, నక్కా అనందబాబు ప్రకటించారు. మార్కెట్‌ యార్డులో జరిగిన సమీక్షలో పాల్గొన్న అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. నందిగామ, నడికుడిలో శనివారం నుంచి, ఇతర ప్రాంతాల్లో ఆ తర్వాత మిర్చి కొనుగోలు చేస్తామని జిల్లా కలెక్టర్‌ కోన శశిధర్‌ వెల్లడించారు. ఈ మార్కెట్లలో మిర్చి కొనుగోలు చేసి ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేసే వ్యాపారులకు రవాణా చార్జీల్లో రాయితీ, అన్ని సదుపాయాలను ప్రభుత్వమే కల్పిస్తుందన్నారు. కాగా, గుంటూరు మిర్చి యార్డుకు మే 16 నుంచి జూన్‌ 4 వరకు సెలవులు ప్రకటించారని, అయినా శని, ఆదివారాల్లో కొనుగోళ్లు కొనసాగుతాయని మంత్రులు తెలిపారు.

ప్రభుత్వం ప్రకటించిన రూ.1,500 రాయితీ పథకం ద్వారా ఇప్పటి వరకు 6,500 మంది రైతుల నుంచి 1.10 లక్షల క్వింటాళ్ల మిర్చిని కొనుగోలు చేశామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన రూ.5 వేల మద్దతు ధరలో స్పష్టత లేదని, రాష్ట్ర ప్రభుత్వ పథకాన్ని మాత్రమే కొనసాగించనున్నట్లు స్పష్టం చేశారు. కాగా, అమెరికా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మిర్చి కొనుగోళ్లపై అధికారులతో టెలీకాన్ఫరెన్స్‌లో మాట్లాడినట్లు సమాచార, పౌర సంబంధాల శాఖ తెలిపింది. క్వింటాల్‌కు మద్ధతు ధర రూ.8 వేలు వచ్చేలా చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పినట్లు వెల్లడించింది. సమీక్షలో ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాలరెడ్డి, మిర్చి యార్డు చైర్మెన్‌ మన్నవ సుబ్బారావు, జెసీ – 2 ముంగా వెంకటేశ్వరరావు, మార్కెట్‌ కార్యదర్శి దివాకర్, ఏడీ వరలక్ష్మి, పోలీసు, రవాణా, కార్మిక శాఖల అధికారులు, ఎగుమతి వ్యాపారుల సంఘం నాయకుడు దుగ్గిరాజు, హమాలీల సంఘం నాయకుడు శ్రీనివాసులరెడ్డి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement