ప్రతీకాత్మక చిత్రం
కొరిటెపాడు(గుంటూరు): గతంలో ఎన్నడూ లేనివిధంగా మార్కెట్‌లో గుంటూరు మిర్చి దుమ్ము రేపుతోంది. మిర్చి మార్కెట్‌లో శుక్రవారం తేజ రకం రికార్డు స్థాయిలో క్వింటా రూ.19,500ల ధర పలికింది. ఇప్పటికే రైతులు విక్రయించిన పంటను మినహాయిస్తే.. శీతల గిడ్డంగుల్లో నిల్వ చేసిన వారికి లాభాల పంట పండనుంది. ఎర్ర బంగారంగా పిలుచుకునే మిర్చిని గతేడాది తక్కువ సాగు చేయగా.. చైనా, థాయిలాండ్ నుంచి ప్రస్తుతం భారీగా ఆర్డర్లు రావడంతో మిర్చి ఘాటు అ‘ధర’హో అనిపిస్తుంది.
చైనా, థాయిలాండ్ నుంచి ఆర్డర్లు
మిర్చి అమ్మకాలకు గుంటూరు మార్కెట్ దేశంలోనే పేరు పొందింది. ఏటా జనవరి మొదటి వారంలో సీజన్ ప్రారంభమవుతుంది. నెలరోజులు వేసవి సెలవులు మినహాయిస్తే నవంబర్ వరకు వ్యాపారం జోరుగా సాగుతుంది. ఈసారి బొబ్బర తెగులు, సాగునీటి కొరత వల్ల మిర్చి దిగుబడి భారీగా తగ్గింది. దీనికి తోడు రైతు ఆశించిన ధర దక్కలేదు. సగటున క్వింటాకు రూ.9 వేలు దక్కింది. అయితే ఒక్కసారిగా మిర్చికి అంతర్జాతీయంగా డిమాండ్ ఏర్పడింది. విదేశాలకు గుంటూరు నుంచే ఎక్కువ ఎగుమతులు జరుగుతాయి. ప్రస్తుతం చైనా, థాయిలాండ్ నుంచి ఆర్డర్లు వస్తున్నాయి. మార్కెట్ యార్డులు, శీతల గిడ్డంగుల్లో సరుకు తక్కువగా ఉండటంతో ధర అమాంతం పెరిగింది. మేలు రకం తేజ క్వింటా ధర రూ.19,500కు చేరింది. మిగిలిన మిర్చి రకాలు కూడా క్వింటా రూ.16 వేలు పలుకుతున్నాయి.
క్వింటా రూ.22 వేలకు పెరిగే అవకాశం
తేజ రకానికి ఇతర రాష్ట్రాల్లోనే కాకుండా అంతర్జాతీయంగా మంచి డిమాండ్ ఉంది. ఈ ఏడాది పచ్చిమిర్చి ధర ఎక్కువగా ఉండటంతో ముందుగానే కోశారు. దీంతో పండు మిర్చి ఉత్పత్తి తగ్గడంతో ధరల పెరుగుదలకు కారణమైంది. పెరుగుదల ఇలాగే కొనసాగితే క్వింటా రూ.22 వేలకు చేరవచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
10 లక్షల టన్నుల నిల్వలు
ప్రస్తుతం రైతుల వద్ద మిర్చి నిల్వలు తక్కువగా ఉన్నాయి. శీతల గిడ్డంగుల్లో 10 లక్షల టన్నుల మేర నిల్వ ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా గత మూడు నెలల నుంచి మిర్చి ధరలు పెరుగుతున్నాయి. గతేడాది ఇదే సమయంలో తేజ, బాడిగ రకాలు క్వింటా రూ.13 వేలు, ఇతర రకాలు రూ.8 వేలు పలికాయి. ప్రస్తుతం తాలు రకాలు రూ.4 వేల నుంచి రూ.5 వేల వరకు పలకడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఖమ్మం మార్కెట్‌లోనూ రికార్డు ధర
ఖమ్మం వ్యవసాయం: తెలంగాణలోని ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో శుక్రవారం తేజ రకం మిర్చి క్వింటా ధర రికార్డు స్థాయిలో రూ.20,021లు పలికింది. గురువారం రూ.18,600 ఉండగా.. ఒక్క రోజులో ఏకంగా రూ.1,400లు పెరిగింది. ఖమ్మం జిల్లా చింతకాని మండలం నర్సింహాపురం గ్రామానికి చెందిన ఎ.రామారావు నుంచి వ్యాపారులు ఈ ధరకు మిర్చిని కొనుగోలు చేశారు. ఖమ్మం మార్కెట్‌లో గతేడాది పండించిన పంటను వ్యాపారులు, కొందరు రైతులు కోల్డ్ స్టోరేజీల్లో నిల్వచేశారు. ఆ నిల్వలకు జూన్ నుంచి ధర పెరుగుతూ వస్తోంది. జూన్‌లో రూ.11వేలు పలికిన ధర నవంబర్ నాటికి రూ.20 వేలకు చేరింది. ప్రస్తుతం పంటను ముంబయి, కోల్‌కతా, ఢిల్లీ వ్యాపారులు కొనుగోలు చేస్తున్నట్లు స్థానిక వ్యాపారులు చెబుతున్నారు. మిర్చికి ఈ స్థాయిలో ధర రావడంతో వ్యాపారులు, రైతులు ఆశ్చర్యపోతున్నారు. ఈ ధర ఇలాగే కొనసాగితే ఈ ఏడాది సాగు చేసిన రైతులకు సిరులు కురుస్తాయని ఆనందంగా చెబుతున్నారు.
పెరిగిన ధరలు ఆశలు రేకెత్తిస్తున్నాయి..
మిర్చి ధరలు ఈ స్థాయిలో పెరగడం గతంలో ఎప్పుడూ చూడలేదు.. చాలా సంతోషంగా ఉంది. ధరలు ఇలానే కొనసాగితే రైతులు కష్టాల నుంచి గట్టెక్కడమే కాదు.. లాభాలనార్జిస్తారు కూడా. రెండెకరాలు కౌలుకు తీసుకుని పదేళ్లుగా మిర్చి సాగుచేస్తున్నా. అప్పులు తప్ప మిగిలిందేం లేదు.. ఈ దశలో మిర్చి ధరలు అమాంతంగా పెరగడం ఆశలు రేకెత్తిస్తోంది. మిర్చి రైతులకు మంచి రోజులొచ్చాయనిపిస్తోంది..
– కొక్కెర నాగేశ్వరరావు, విశదల, గుంటూరు జిల్లా
Comments
Please login to add a commentAdd a comment