శ్రీరాఘవేంద్రస్వామి దర్శనార్థం బెంగళూరు నుంచి వచ్చిన దంపతులు ఆదివారం ఉదయం మంత్రాలయంలో ఆకతాయి చేష్టలను భరించాల్సి వచ్చింది.
బాత్‌రూంలో స్నానం చేస్తుండగా ఫొటో తీశారని ఓ మహిళ ఫిర్యాదు
ఫిర్యాదును స్వీకరించని పోలీసులు
మంత్రాలయం/మంత్రాలయం టౌన్ : శ్రీరాఘవేంద్రస్వామి దర్శనార్థం బెంగళూరు నుంచి వచ్చిన దంపతులు ఆదివారం ఉదయం మంత్రాలయంలో ఆకతాయి చేష్టలను భరించాల్సి వచ్చింది. టీడీపీ నేతకు చెందిన లాడ్జిలో వారు అద్దెకు దిగారు. ఉదయం బాత్‌రూంలో స్నానం చేస్తున్న సమయంలో కెమెరా ఫ్లాష్ వెలిగినట్లు గుర్తించిన మహిళ ఎవరో ఫొటోలు తీసినట్లు గ్రహించి కిటికీ వైపు చూసింది. అక్కడి నుంచి ఓ యువకుడు పరారైనట్లు గుర్తించింది. అనంతరం దంపతులు జరిగిన విషయంపై పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయగా పోలీసులు ఉచిత సలహాలు ఇచ్చి పంపించేశారు.
లాడ్జీకి వెళ్లి దృశ్యాల చిత్రీకరణకు అవకాశం లేదని వదిలేశారు. సాయంత్రం మరో ఇద్దరు కానిస్టేబుళ్లను పంపి విచారణ చేయించిన సీఐ నాగేశ్వరావు సదరు బాత్‌రూం కిటికీ నుంచి వీడియో తీయడానికి వీలున్నట్లు నిర్ధారించారు. దీంతో ఎస్‌ఐ మునిస్వామి తీరుపై బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించి వివరణ కోరగా లాడ్జీ నిర్వాహకులు, రూం బాయ్‌లను విచారించి నిందితులను పట్టుకుంటామని సీఐ తెలిపారు.
విచక్షణ కోల్పోతున్న ఖాకీలు :
భక్తులకు భరోసాగా నిలవాల్సిన పోలీసులు విచక్షణ మరిచిపోతున్నారు. ప్రేమజంటలను బ్లాక్‌మెయిల్ చేసి డబ్బులు గుంజిన సంఘటనలున్నాయి. ఇటీవల ఓ లాడ్జీలో ప్రేమజంట పట్టుబడితే రూ.30 వేల దాకా లాగేసుకున్నట్లు ఆరోపణలున్నాయి. మొన్నటికి మొన్న తుంగభద్ర నదీతీరంలో పార్కు చేసి ఉన్న కారు డోరు అద్దం పగలగొట్టి కొంత నగదు,సెల్‌ఫోన్ తస్కరించడం తెలిసిందే. సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించిన ఎస్‌ఐ మునిస్వామిని వివరణ కోరగా తనకు ఏమీ తెలియదని చెప్పడం విడ్డూరం.