మియాపూర్‌కు మెట్రో వెలుగు!
హైదరాబాద్: మియాపూర్... ఒకప్పుడు నగరం నుంచి విసిరేసిన ట్టుగా ఉండేది. మెరుగైన మౌలిక సదుపాయాలుండేవి కావు. కానీ, నేడా పరిస్థితులు లేవు. ఆసియాలోనే అతిపెద్ద బస్టాండ్ ప్రాంగణం... 269 ఎకరాల్లో నిర్మించనున్న మెట్రో రైల్వే టెర్మినల్‌తో ఇప్పుడీ ప్రాంతం హైదరాబాద్‌ను ప్రపంచ దేశాల సరసన నిలబెడుతోంది. మియాపూర్ చుట్టుపక్కల ప్రాంతాల్ని హెచ్‌ఎండీఏ మాస్టర్‌ప్లాన్‌లో ‘పారిశ్రామిక జోన్’గా ప్రకటించింది. దీంతో పలు కంపెనీలు తమ సంస్థల్ని ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు వేస్తున్నాయి.
హైటెక్ సిటీ, సైబర్ టవర్స్‌తో మాదాపూర్ మాత్రమే కాదు... మియాపూర్, గచ్చిబౌలి, నానక్‌రాంగూడ, శేరిలింగంపల్లి వంటి ప్రాంతాలకు అభివృద్ధి శరవేగంగా వెళ్లింది. మియాపూర్ నుంచి మాదాపూర్, గచ్చిబౌలి వంటి ప్రాంతాలకు సులువుగా ప్రయాణం చేసే సౌకర్యాలుండటం, మెగా షాపింగ్ మాళ్లు, సినిమా థియేటర్లు, అంతర్జాతీయ ఆసుపత్రులు, విద్యా సంస్థలు, మియాపూర్ నుంచి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఔటర్ రింగ్ రోడ్డు మీదుగా కేవలం అరగంట ప్రయాణం... ఇవన్నీ మియాపూర్ అభివృద్ధిని రెండింతలు చేశాయి.
వ్యక్తిగత గృహాలతో పాటు గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టులు, లగ్జరీ విల్లాలు కూడా మియాపూర్‌లో అధికం. ప్రస్తుతం ఇక్కడ చ.అ. ధర రూ.3,000 నుంచి ప్రారంభమౌతోంది. కానీ, మరో ఆరు నెలల్లో సుమారు రూ.4,500కు చేరవచ్చని క్రెడాయ్ రాష్ట్ర అధ్యక్షుడు, ఎస్‌ఎంఆర్ హోల్డింగ్స్ అధిపతి రామ్‌రెడ్డి చెప్పారు. ఐటీ, ఇండస్ట్రియల్, ఎడ్యుకేషనల్ సంస్థలకు మియాపూర్ కేంద్రబిందువుగా మారిందంటూ... మెట్రో టెర్మినల్, అంతర్జాతీయ షాపింగ్‌మాళ్లు, ఆసుపత్రులకు నిలయం కావడమే ఇందుకు కారణమని అభిప్రాయపడ్డారు.
మెట్రో ఎఫెక్ట్...
కారిడార్-1లో భాగంగా మియాపూర్ నుంచి ఎల్బీనగర్ వరకు 28.87 కి.మీ.లలో మెట్రో వస్తోంది. ప్రస్తుతం మియాపూర్ నుంచి ఎస్‌ఆర్ నగర్ మార్గాల్లో మెట్రో పనులు శరవేగంగా జరుగుతున్నాయి. రహదారుల విస్తరణ, పిల్లర్లపై సెగ్మెంట్ల అమరిక జరుగుతోంది. 2015 ఆగస్టు నాటికి ఈ మార్గం పూర్తవుతుందని ఎల్ అండ్ టీ వర్గాలు చెబుతున్నాయి.
మియాపూర్‌లో 269 ఎకరాల్లో మెట్రో రైల్వే టెర్మినల్‌ను నిర్మిస్తున్నారు. ఇప్పటికే 50 శాతం పనులు పూర్తయ్యాయి. భవిష్యత్తులో ఇక్కడి నుంచి మెట్రో రైల్‌ను మరింత విస్తరించే అవకాశం ఉందనేది నిపుణుల మాట. బాచుపల్లి నుంచి గచ్చిబౌలి, పటాన్‌చెరు వరకూ అభివృద్ధి చేయాలనే ప్రతిపాదనలు ఉన్నట్లు సమాచారం. ఇదే సాధ్యమైతే రానున్న రోజుల్లో మియాపూర్ అతిపెద్ద జంక్షన్‌గా అంతర్జాతీయ స్థాయికి చేరుతుంది.
మెట్రో కారిడార్లలో కళ్లు చెదిరే మాల్స్, మల్టీప్లెక్స్‌ల నిర్మాణానికి ముహూర్తం ఖరారైంది. హైటెక్ సిటీ ఎదురుగా 2 లక్షల చ.అ. విస్తీర్ణంలో 2 మెట్రో మాల్స్‌లను నిర్మించేందుకు ఎల్‌అండ్‌టీ సంస్థ ప్రణాళికలు రచించింది.
కూతవేటు దూరంలో..
మియాపూర్ మెట్రో రైల్వే టెర్మినల్‌కు కూతవేటు దూరంలో నగరంలోని పలు నిర్మాణ సంస్థల ప్రాజెక్ట్‌లున్నాయి. మై హోమ్ జ్యుయల్, అపర్ణా సైబర్ కౌంటీ, ఎస్‌ఎంఆర్ వినయ్ సిటీ, ల్యాండ్‌మార్క్ టవర్స్, ఆర్‌వీ అవనీంద్ర, హేమదుర్గా టవర్స్ వంటివి పూర్తికాగా దివ్యశ్రీ శక్తి, ఫార్చ్యూన్ హైట్స్, జనప్రియ నైల్‌వ్యాలీ వంటి ప్రాజెక్టుల పనులు కొనసాగుతున్నాయి.
9 ఎకరాల్లో 965 ఫ్లాట్లతో ఎస్‌ఎంఆర్ నిర్మిస్తున్న వినయ్ ఫౌంటెయిన్ హెడ్, 2 ఎకరాల్లో 196 ఫ్లాట్లతో ఆర్‌వీ నిర్మాణ్ నిర్మిస్తున్న శిల్ప హోమ్స్ ప్రాజెక్టులున్నాయి. వీటిలో ధర రూ.3,200 నుంచి 3,600 వరకు చెబుతున్నారు.