
సాక్షి, కర్నూలు : నందికొట్కూరులోని మారుతీనగర్, బైరెడ్డి నగర్ కాలనీల్లో కరోనా వైరస్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే ఆర్థర్ వెల్లడించారు. ఈ నేపథ్యంలో మంగళవారం నందికొట్కూరులోని పలు కాలనీలను సందర్శించి ప్రజా సమస్యలు తెలుసుకున్నారు. కాలనీల్లో ఎప్పటికప్పుడు శానిటేషన్ పనులు ముమ్మరంగా చేపట్టాలని మున్సిపాలిటీ అధికారులను ఆదేశించారు. రెండు రోజులకొకసారి కాలనీలో బ్లీచింగ్ పౌడర్, హైపో ద్రవనంతో పిచికారీ చేయాలన్నారు. కాలనీలో పందుల బెడద ఎక్కువగా ఉందంటూ కాలనీ వాసులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగ వెంటనే పందులను తరలించాలని కమిషనర్ ను ఆదేశించారు. మాస్కులు లేకుండా బయట తిరుగుతున్న వారికి కౌన్సెలింగ్ ఇవ్వడంతో పాటు కరోనా వైరస్‌పై ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రజలు భౌతిక దూరం పాటిస్తూ కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆర్థర్ సూచించారు.