
ఎదురు దాడే సిద్ధాంతం..: గడికోట
సాక్షి,హైదరాబాద్: అసెంబ్లీ శీతాకాలపు సమావేశాల్లో ఎదురుదాడే తమ సిద్ధాంతమన్నట్టుగా పాలకపక్షం వ్యవహరిస్తోందని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి విమర్శించారు. చాలా దౌర్భాగ్యంగా అసెంబ్లీని నడిపిస్తున్నారని మండిపడ్డారు. ప్రజాసమస్యలపై సభలో చర్చించేందుకు ప్రభుత్వం సహకరించట్లేదన్నారు. ఎమ్మెల్యేలు వై.విశ్వేశ్వరరెడ్డి, చాంద్‌బాషాలతో కలసి ఆయన శనివారం అసెంబ్లీ మీడియా పాయింట్‌లో మాట్లాడుతూ శాసనసభలో అధికార టీడీపీ అనుసరిస్తున్న వైఖరిపై నిప్పులు చెరిగారు.
కాల్‌మనీ-సెక్స్ రాకెట్ అంశంతోపాటు వ్యవసాయం, రైతులు, అంగన్‌వాడీలు, డ్వాక్రా మహిళల సమస్యలు అసలే పట్టవన్నారు. ప్రజల ఇక్కట్లను ప్రస్తావించేందుకు తమ పార్టీ సభ్యులు చేస్తున్న ప్రయత్నాన్ని అడ్డుకుంటున్నారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.