
సాక్షి, విజయనగరం: హామీల అమలు విషయంలో ప్రభుత్వ తీరును విమర్శిస్తూ సోషల్ మీడియాలో వస్తున్న పోస్టింగులను ప్రభుత్వ పెద్ద చంద్రబాబే కాదు.. టీడీపీ ప్రజాప్రతినిధులు కూడా సహించలేకపోతున్నారు. మాపైనే రాతలా అంటూ అగ్గి మీద గుగ్గిలమైపోతున్నారు. తాజాగా విజయనగరం జిల్లా గజపతినగరం ఎమ్మెల్యే కేఏ నాయుడు నెటిజన్లపై తన అక్కసును వెల్లగక్కారు. ప్రజలకిచ్చిన హామీలను ఎమ్మెల్యే నిలబెట్టుకోలేదంటూ సోషల్ మీడియాలో కొన్ని పోస్టింగులు హల్‌చల్ చేస్తున్నాయి.
వాటిని ఎమ్మెల్యే తట్టుకోలేకపోయారు. వెంటనే తన అనుచరులతో వచ్చి స్థానిక పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు కొందరు యువకులను స్టేషన్‌కు పిలిపించి విచారిస్తున్నారు. ఇప్పటికే 'ఇంటింటికీ తెలుగుదేశం' కార్యక్రమానికి వెళ్తున్న తెలుగు తమ్ముళ్లను ప్రజలు నిలదీస్తుండగా సోషల్ మీడియాలోనూ విమర్శలు వెల్లువెత్తుతుండడంతో అధికార పార్టీ నేతలు మరింత అసహనానికి గురవుతున్నారు.