ఎమ్మెల్యే కోటంరెడ్డికి మాతృ వియోగం | MLA Kotamreddy Sridhar Reddy Mother Passed Away in SPSR Nellore | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యే కోటంరెడ్డికి మాతృ వియోగం

Published Sat, Jun 20 2020 12:33 PM | Last Updated on Sat, Jun 20 2020 12:33 PM

MLA Kotamreddy Sridhar Reddy Mother Passed Away in SPSR Nellore - Sakshi

కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, గిరిధర్‌రెడ్డితో తల్లి సరళమ్మ (ఫైల్‌)

నెల్లూరు(సెంట్రల్‌): నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి తల్లి మృతి చెందారు. ఆయన తల్లి సరళమ్మ శుక్రవారం అనారోగ్యంతో కన్నుమూశారు. సంగం మండలం పడమటిపాళెంలో శనివారం ఉదయం 10.30 గంటలకు అంత్యక్రియలను నిర్వహించనున్నారు. 

విషాదంలో పడమటిపాళెం
సంగం: నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి తల్లి కోటంరెడ్డి సరళమ్మ (72) మృతితో సంగం మండలం పడమటిపాళెంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆమె మృతి విషయాన్ని తెలుసుకున్న గ్రామస్తులు కన్నీరుమున్నీరయ్యారు. ఆమె గతంలో తమకు చేసిన సాయాన్ని గుర్తుచేసుకుంటూ తీవ్ర ఉద్వేగానికి లోనయ్యారు. ఆమె భౌతికకాయానికి నివాళులర్పించి శ్రద్ధాంజలి ఘటించారు.

రోదించిన ఎమ్మెల్యే
తల్లి మృతి చెందారనే సమాచారం అందుకున్న వెంటనే ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి పడమటిపాళేనికి శుక్రవారం రాత్రి చేరుకున్నారు. తల్లి మృతదేహాన్ని చూసి కన్నీటి పర్యంతమయ్యారు. కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి కన్నీరు పెట్టడం చూసి గ్రామస్తులు, స్నేహితులు సైతం కన్నీటి పర్యంతమయ్యారు. రెండో కుమారుడు, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నెల్లూరు రూరల్‌ కార్యాలయ ఇన్‌చార్జి కోటంరెడ్డి గిరిధర్‌రెడ్డి తీవ్ర విషాదంలో మునిగిపోయారు. సరళమ్మ మృతదేహానికి మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ ఏసునాయుడు, విజయా డెయిరీ చైర్మన్‌ కొండ్రెడ్డి రంగారెడ్డి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. 

సంతాపం వ్యక్తం చేసిన మంత్రి మేకపాటి  
ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి తల్లి సరళమ్మ ఆకస్మిక మృతికి మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, కోటంరెడ్డి గిరిధర్‌రెడ్డికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. నియోజకవర్గ ప్రజలను కుటుంబంలా చూసుకునే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ధైర్యంగా ఉండాలని మంత్రి పేర్కొన్నారు.

నివాళులర్పించిన కాకాణి
నెల్లూరు(సెంట్రల్‌): నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి తల్లి సరళమ్మ పార్థివదేహానికి సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి సంగం మండలం పడమటిపాళెంలో నివాళులర్పించారు. కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, గిరిధర్‌రెడ్డికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement