
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో గురువారం ఇంగ్లీష్ మీడియంపై చర్చ సందర్భంగా చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూధన్‌రెడ్డి చేసిన ప్రసంగం సభలో నవ్వులు పూయించాయి. ఇంగ్లీష్ రాకపోవడంతో తన జీవితంలో జరిగిన సంఘటనలను ఆయన సభ ముందు ఉంచారు. ఆంగ్ల భాషకు ఉన్న ప్రాధాన్యతను ఎమ్మెల్యే ఈ సందర్భంగా వివరించారు. అమెరికా వెళ్లినప్పుడు తన అర కొర ఇంగ్లీష్ పరిజ్ఞానంతో ఎలా తిప్పలు పడ్డారో చెప్పిన సందర్భంగా సభలోని సభ్యులు గొల్లున నవ్వారు.
‘ఈ మధ్య జగనన్న అమెరికా పోయినప్పుడు నేనూ పోయినా. అక్కడ ఇమ్మిగ్రేషన్ అధికారులు నన్ను ఒక ఒక విషయాన్ని అడిగారు. ఎందుకొచ్చినావ్ అమెరికాకు అని? నాకు తెలిసీ తెలియని భాషలో ఇట్స్ ఎ బిగ్ మీటింగ్, ఇట్స్ కమింగ్, గ్యాదరింగ్, ఐ యామ్ గోయింగ్ టు మీటింగ్ సార్ అని అన్నా. వాళ్లకి అర్థం కాలేదు. బిగ్ గ్యాదరింగ్ అని అనకూడదట.
దాంతో నన్ను ఎత్తుకెళ్లి పక్కనేసినారు టు అవర్స్. నాకు చెమట పట్టిపోయింది. అప్పుడు వాసుదేవరెడ్డి అనే డాక్టర్‌కు ఫోన్ చేసినా. ఏమి చెప్పాలని. బంధువుల ఇంటికి వచ్చినామని వాళ్లు చెప్పమన్నారు. మీరు నమ్ముతారో నమ్మరో నేను అంత టెన్షన్ పడ్డా అమెరికాలో. నాతో పాటు వచ్చిన వాళ్లకు కూడా ఇంగ్లీష్ అంతంతే. ఇద్దరి పరిస్థితి ఒకటే’ అని అన్నారు. తిండి విషయంలోనూ అలాంటి పరిస్థితే ఎదురైందని చెప్పుకొచ్చారు.
‘అలాగే వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక చైనా పారిశ్రామిక దిగ్గజం టీసీఎల్ కంపెనీకీ ఓ స్థలం విషయానికి సంబంధించి ఆ కంపెనీకి చెందిన ప్రతినిధులు నా దగ్గరకు వచ్చారు. నాకొచ్చిందేమో బట్లర్ ఇంగ్లీష్. చైనీస్ ప్రతినిధులకు అనువాదం చేయడానికి వచ్చినామెకు ఫుల్‌గా ఇంగ్లీష్ వచ్చు. రెండు నిమిషాల పనికి మా మధ్య రెండు గంటల సమయం పట్టింది. చివరకు వాళ్ల హావాభావాలతో విషయం అర్థం అయ్యింది’ అంటూ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి వివరించిన శైలితో అసెంబ్లీలో సభ్యులందరూ ఫక్కున నవ్వారు.
Comments
Please login to add a commentAdd a comment