సాక్షి, అమరావతి: ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియంపై చర్చ సందర్భంగా శింగనమల వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఏదైనా అనుకుంటే దానిని చేసి తీరుతారని పేర్కొంటూ.. ఓ సినిమా డైలాగును ఆమె ఉటంకించారు. ‘నువ్వు అనుకుంటే అవ్వుద్ది స్వామి.. నీ నవ్వు వరం.. నీ కోపం శాపం.. నీ మాట శాసనం’ అంటూ ఆమె పేర్కొన్నారు. పేద, మధ్యతరగతి కుటుంబాల్లో సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వెలుగులు నింపుతున్నారని అన్నారు. ఇంగ్లిష్ మీడియంలో చదివినంతమాత్రాన తెలుగు రాదనడం సరికాదన్నారు. చంద్రబాబుకు అమరావతి తప్ప మరేమీ కనిపించడం లేదని, ఆయన డ్రామాలు నెవర్ బిఫోర్.. ఎవర్ ఆఫ్టర్ అని ఎద్దేవా చేశారు. చంద్రబాబు తనయుడు నారా లోకేశ్ అసలు ఏ మీడియంలో చదువుకున్నారో అర్థం కావడం లేదని, ఆయనకు తెలుగు, ఇంగ్లిష్.. రెండూ రావడం లేదని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
ఎమ్మెల్యే ధనలక్ష్మి మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ విద్యపై గగ్గోలు పెడుతున్న నాయకులు తమ పిల్లల్ని ఎక్కడ చదివిస్తున్నారో చెప్పాలని అడిగారు. చంద్రబాబు మనవడు ఏ స్కూల్లో చదువుతున్నాడని ప్రశ్నించారు. ప్రైవేటు స్కూళ్లలో తెలుగు మాట్లాడితే ఫైన్ వేస్తున్నారని తెలిపారు. విద్యారంగంలో సంస్కరణల వల్ల ఎన్నో మార్పులు వస్తాయని పేర్కొన్నారు. ఎమ్మెల్యే ఉషాచరణ్ మాట్లాడుతూ.. ప్రపంచంతో పోటీపడాలంటే ఇంగ్లిష్ తప్పనిసరి అని అన్నారు. మన అనుకుంటేనే ప్రజలకు ఏదైనా చేయగలమని, అలా అనుకున్నారు కాబట్టే సీఎం జగన్ ఎన్నో ప్రజాసంక్షేమ పథకాలు చేపడుతున్నారని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment