
సాక్షి, అమరావతి: ఏపీ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. అసెంబ్లీ సమావేశాల్లో గురువారం భాగంగా మహిళా సాధికారతపై స్వల్ప కాలిక చర్చ జరిగింది. ఈ సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి మాట్లాడుతూ.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై సెటైర్లు వేశారు. చంద్రబాబును అందరూ ముందు చూపు ఉన్న వ్యక్తి అంటుంటారని, అది నిజమేనని తెలిపారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు తెలుగు దేశం పార్టీని ఎప్పుడో ఒకప్పుడు భూస్థాపితం చేస్తారని, రాష్ట్రం నుంచి ముళ్లే మూటా సర్ధుకోవాల్సి వస్తుందని ముందే తెలిసి బాబు హైదరాబాద్‌లో ఇల్లు కట్టుకున్నారని ఎద్దేవా చేశారు. ఇలాంటి విషయాల్లో చంద్రబాబుకు విజన్ ఉందని ఆమె వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
చదవండి: అందుకే కుప్పంలో జనం మొట్టికాయలు వేశారు: సీఎం జగన్
‘సాధారణంగా అందరూ చెబుతూ ఉంటారు. ఆడవాళ్లు తలుచుకుంటే రాజ్యాలే కూలిపోతాయని, కానీ ఈ రోజు నేను చెబుతున్నా.. ఆడవాళ్లతో పెట్టుకుంటే రాజ్యాలే కాదు. రాజకీయాలు కూడా కూలిపోతాయని అక్క చెల్లెమ్మలందరు చంద్రబాబుకు గట్టిగా బుద్ధిచెప్పారు. పాపం ఇప్పటికే ఉత్తర కుమారుడిని చూసుకొని చంద్రబాబు ఏడ్వని రోజంటూ లేదు. మరోవైపు కుప్పంలోని ప్రజలు ఆయన్ను నిండా ముంచేశారు. దీంతో ఆయన ఎక్కడ ఉన్నారో, ఏ బాధలో ఉన్నారో కూడా తెలీదు.
చదవండి: మహిళా సాధికారతపై స్వల్పకాలిక చర్చ
ఏదైమైనా సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంలో రాష్ట్రంలోని అక్కాచెల్లెలందరూ సంతోషంగా ఉన్నారు. మా నియోజకవర్గంలో అందరూ కూడా ఎప్పటికీ వైఎస్ జగన్‌కు అండగా ఉంటామని చెబుతున్నారు. ఆంధ్ర రాష్ట్ర అక్కాచెల్లెలందరి ఆశీస్సులతో, దీవెనలతో మరింత కాలంపాటు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా కొనసాగాలని కోరుకుంటున్నా. ఈ ప్రభుత్వంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నందుకు గర్వపడుతున్నాను’ అని ఎమ్మెల్యే ధనలక్ష్మి పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment