సాక్షి, అమరావతి: ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెడుతూ తీసుకున్న నిర్ణయం ఒక చరిత్రాత్మక ఘట్టం అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ఇక నుంచి రైట్ టు ఎడ్యుకేషన్ కాదని, రైట్ టు ఇంగ్లిష్ ఎడ్యుకేషన్ అని ఆయన స్పష్టం చేశారు. ఇందు కోసం తీసుకొచ్చిన ఏపీ ఎడ్యుకేషన్ అమెండ్‌మెంట్ బిల్లు–2019తో, ఇక నుంచి ప్రతి పేద విద్యార్థికి ఇంగ్లిష్ మీడియమ్‌ను ఒక హక్కుగా తీసుకు వస్తుందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియమ్ ప్రవేశపెడుతూ తీసుకొచ్చిన ఏపీ ఎడ్యుకేషన్ అమెండ్‌మెంట్ బిల్లుపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సభలో మాట్లాడారు. రైట్ టు ఎడ్యుకేషన్‌ను రైట్ టు ఇంగ్లిష్ ఎడ్యుకేషన్‌గా మార్చబోతున్నామని ఈ సందర్భంగా సీఎం వెల్లడించారు. ఈ బిల్లు ప్రవేశ పెట్టడం ఒక చరిత్రాత్మక నిర్ణయం అన్న ఆయన, ఈ బిల్లుతో రాష్ట్రంలో ప్రతి ప్రభుత్వ పాఠశాల ఇక మీద ఇంగ్లిష్ మీడియం స్కూల్‌గా మారబోతుందన్నారు.
‘రాష్ట్రంలో అక్షరాలా 45 వేల ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. వాటిలో 1 నుంచి 6వ తరగతి వరకు వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇంగ్లిష్ మీడియం కాబోతున్నాయి. ఆ తర్వాత సంవత్సరం 7వ తరగతి, ఆ తర్వాత ఏడాది 8వ తరగతి, ఆ తర్వాత 9వ తరగతి, ఆ మరుసటి సంవత్సరం 10వ తరగతిని ఇంగ్లిష్ మీడియంగా మారుస్తున్నాం. ఆ విధంగా నాలుగేళ్లలో మన పిల్లలందరూ 10వ తరగతి బోర్డు పరీక్ష ఇంగ్లిష్ మీడియంలో రాసే విధంగా ఈ బిల్లు మార్చబోతున్నది. ఇది ఒక చరిత్రాత్మక బిల్లు అని తెలియజేస్తున్నాను’ అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. అనంతరం ఏపీ ఎడ్యుకేషన్ అమెండ్‌మెంట్ బిల్లు–2019ను సభ ఆమోదించింది. ఆ తర్వాత స్పీకర్ తమ్మినేని సీతారాం సభను మంగళవారం ఉదయానికి వాయిదా వేశారు.
Comments
Please login to add a commentAdd a comment