ఏ ఒక్కరినీ లక్ష్యంగా అడ్డుకోలేదు
- ఇసుక, మట్టి అక్రమ రవాణాను అరికట్టాలని కోరా..
- ప్రకాశం బ్యారేజ్‌పై సెట్విన్ బస్సులు నడపాలి
- ఎమ్మెల్యే ఆర్కే
మంగళగిరి: ఇసుక, మట్టి తోలకాల్లో తాను అక్రమ రవాణాను మాత్రమే అడ్డుకోవాలని అధికారులను కోరానని ఏ ఒక్కరిని లక్ష్యంగా చేయలేదని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే) అన్నారు. సోమవారం ఆయన ఫోన్‌లో సాక్షితో మాట్లాడుతూ ఇసుక, మట్టి చట్టప్రకారం చేసుకునేవారికి ఎలాంటి ఇబ్బంది వుండదని, అక్రమంగా వనరులను దోచుకునే వారిని మాత్రమే అడ్డుకుంటామన్నారు. బెదిరింపు లేఖలు వచ్చినంత మాత్రాన అక్రమాలను అడ్డుకోబోమని అనుకోవడం వారి అవివేకమన్నారు. అధికారులు తమ నిబంధలకు అనుగుణంగా అక్రమాలను అడ్డుకోవాలని సూచించారు.
శాసనసభ సమావేశాల్లో సోమవారం జీరోఅవర్‌లో అవకాశం లభించడంతో .. సీతానగరం వద్ద ప్రకాశం బ్యారేజిపై గడ్డర్లను కిందకు ఏర్పాటుచేయడం వల్ల వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారని సభ దృష్టికి తీసుకువెళ్లానని ఆర్కే పేర్కొన్నారు. గడ్డర్లు ఏర్పాటుతో అంబులెన్స్‌కూడా వెళ్లే పరిస్థితి లేకపోవడంతో ప్రజలు తీవ్రఇబ్బందులు పడుతున్నారన్నారు. నియోజకవర్గంలోని పలు గ్రామాల ప్రజలు, రైతులు కనకదుర్గవారధి మీదుగా విజయవాడ వెళ్లాలంటే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ప్రకాశం బ్యారేజి వద్దఏర్పాటుచేసిన గడ్డర్లు ఎత్తుపెంచడంతో పాటు బ్యారేజిపై తిరిగేందుఉ కనీసం సెట్విన్ బస్సులు ఏర్పాటు చేయాలని కోరినట్లు చెప్పారు. దీనిపై సంబంధిత మంత్రి శిద్ధా రాఘవరావు స్పందిస్తూ సంబంధిత అధికారులతో సమావేశం ఏర్పాటుచేసి సమస్యను పరిష్కరిస్తానని చెప్పినట్లు ఆర్కే తెలిపారు.