‘మనసులో మాట బయటపెట్టిన లోకేశ్’
విజయవాడ: ఏపీ తాగునీటిలో నీటి ఎద్దడి తెస్తానని అల్లుడు నారా లోకేశ్ చెప్పగానే, ఆయన మామ బాలకృష్ణ తన నియోజకవర్గం హిందూపురంలో అమలు చేశారని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా ఎద్దేవా చేశారు. గురువారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. లోకేశ్ తీరు జబర్దస్త్ కామెడీ షోను మించిపోయిందని వ్యాఖ్యానించారు.
తాగునీటి సమస్యను సృష్టించడానికే మంత్రిని అయ్యానని చెప్పి మనసులో మాటను బయటపెట్టారని అన్నారు. తన తండ్రి నియోజకవర్గం కుప్పం, మామ నియోజకవర్గం హిందూపురంలోనే నీళ్లు లేకుండా చేశారని విమర్శించారు. తాగునీటి కోసం హిందూపురంలో ధర్నా చేసే పరిస్థితి వచ్చినందుకు అధికార పార్టీ నాయకులు సిగ్గుపడాలన్నారు. ప్రతి మాటలోనూ తప్పులు దొర్లుతున్నా తమ మాటలను కంట్రోల్ చేసుకోలేని చినబాబు సోషల్ మీడియాను కంట్రోల్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. సోషల్ మీడియాపై కేసులు ఎలా పెడతారని ప్రశ్నించారు. కేసులు పెడితే ముందుగా లోకేశ్ పైనే పెట్టాలన్నారు.
చంద్రబాబు పాలన గురించి మూడు ముక్కల్లో చెప్పాలంటే ముడుపులు, మోసాలు, అరాచకాలుగా పేర్కొనవొచ్చని ఎమ్మెల్యే రోజా అన్నారు. తన మూడేళ్ల పాలనలో రాష్ట్రానికి కరువును ఇచ్చారని ఎద్దేవా చేశారు. అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారని దుయ్యబట్టారు. ఆరు వందల హామీల్లో ఏ ఒక్కటీ నెరవేర్చలేదన్నారు. ఇంటికో ఉద్యోగం ఇస్తానని చెప్పి లోకేశ్ ను మంత్రిని చేశారని చెప్పారు. పేదలకు పక్కా ఇళ్లు కట్టిస్తామని చెప్పి పక్క రాష్ట్రంలో ఇంద్రభవనం నిర్మించుకున్నారని ధ్వజమెత్తారు.