రోజాపై మళ్లీ వేటుకు రంగం సిద్ధం చేస్తున్నారా?
అమరావతి: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, ఎమ్మెల్యే రోజాపై మరోసారి ఏపీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగుతుందా? ఆమెను దాదాపు ఏడాదిపాటు సభలో అడుగుపెట్టనివ్వకుండా చేసిన ప్రభుత్వం తిరిగి మరోసారి ఆమెను సభలోకి రాకుండా అడ్డుకునేందుకు రంగం సిద్ధం చేస్తుందా అంటే ప్రస్తుత పరిణామాలు అవుననే చెబుతున్నాయి. మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడిన ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడి వ్యాఖ్యలు అందుకు తార్కాణంగా నిలుస్తున్నాయి. ఎమ్మెల్యే రోజా కచ్చితంగా సభకు క్షమాపణలు చెప్పాలని యనమల మంగళవారం మీడియాకు చెప్పారు.
షరతులతో కూడిన క్షమాపణలు ఉండబోమని అన్నారు. ఎమ్మెల్యే రోజా బేషరతుగా క్షమాపణ చెప్పాల్సి ఉంటుందని ఆయన చెప్పారు. నేడు సభా హక్కుల కమిటీ నివేదిక ఇస్తుందని, దానిపై సభాపతి నిర్ణయం తీసుకుంటారని యనమల చెప్పారు. సీఎంపై చేసిన అనుచిత వ్యాఖ్యల్లో సస్పెన్షన్ గడువు ముగిసినందునే సభకు రోజా వస్తున్నారని, టీడీపీ ఎమ్మెల్యే అనిత ఫిర్యాదుపై ప్రస్తుతం సభా హక్కుల కమిటీ నివేదిక రూపొందించిందని యనమల చెప్పారు. దీని ప్రకారం సభలో అందరిముందు ఆమె క్షమాపణ చెప్పాలని అధికార పక్షం డిమాండ్ చేయనున్నట్లు తెలుస్తోంది.