సాక్షి, హైదరాబాద్: పరోక్ష పద్ధతిలో మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నిక ల్లో ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు ఓటు వేయవచ్చని ఎన్నికల సంఘం(ఈసీ) స్పష్టం చేసింది. ప్రస్తుతం రాష్ట్రపతి పాలన ఉన్నప్పటికీ.. అసెంబ్లీ రద్దు కాలేదని సుప్తచేతనావస్థలో మాత్రమే ఉందని, అందువల్ల వారి పదవీ కాలం ఉన్నంత వరకు ఓటు వేయడానికి అర్హులేనని వివరించింది. వీరంతా కార్పొరేషన్, మున్సిపాలిటీ, జెడ్పీ, మండల పరిషత్‌లలో ఏదో ఒక్కచోట మాత్రమే ఓటు వేయడానికి అర్హులని, దేనిని ఎంపిక చేసుకోవాలన్నది వారి ఇష్టమని ఈసీ తెలిపింది. మున్సిపాలిటీలు/కార్పొరేషన్లకు సంబంధించి దేనిని ఎంపిక చేసుకుంటారో పేర్కొంటూ ఏప్రిల్ మూడులోగా లేఖలు పంపాలని పేర్కొంది.