
రాష్ట్రంలో ‘420’ పాలన
మెరకముడిదాం: రాష్ట్రంలో ‘420’ పాలన సాగుతోందని ఎమ్మెల్సీ, వైఎస్సార్‌సీపీ ఉత్తరాంధ్ర సమన్వయకర్త కోలగట్ల వీరభద్రస్వామి ఆరోపించారు. మండలంలోని చినబంటుపల్లిలో 24 పంచాయతీలకు సంబంధించి బూత్ లెవెల్ కమిటీ సభ్యులకు బుధవారం శిక్షణ సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అధికారంలోకి వచ్చినప్పటినుంచి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఆయన కుమారుడు, మంత్రి లోకేష్‌లు దోచుకో.. దాచుకో.. అన్నరీతిలో వ్యవహరిస్తున్నారన్నారు. ఇటీవల విజయవాడలో జరిగిన రాష్ట్రస్థాయి ప్లీనరీలో పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి నవరత్నాలు లాంటి సంక్షేమ పథకాలను అమలు చేస్తామని ప్రకటించారన్నారు.
ఈ పథకాలపై గ్రామస్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత బూత్ లెవెల్ కమిటీ సభ్యులపై ఉందన్నారు. పార్టీ విజయనగరం జిల్లా పరిశీలకుడు, మాజీ ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాసు మాట్లాడుతూ, దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు. అటువంటి పాలన మళ్లీ రావాలంటే జగనన్న ముఖ్యమంత్రి కావాలని తెలిపారు. నిత్యం ప్రజల మధ్య ఉంటూ సమస్యలపై పోరాడుతున్న నాయకుడు ఒక్క జగన్‌మోహన్‌రెడ్డేనని స్పష్టం చేశారు. బూత్ లెవిల్ కమిటీ సభ్యులు ఇంటింటికీ వెళ్లి నవరత్నాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు.పార్టీ జిల్లా అధ్యక్షుడు బెల్లాన చంద్రశేఖర్ మాట్లాడుతూ, పార్టీ బలోపేతానికి పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి, సీనియర్ నాయకుడు బొత్స సత్యనారాయణ సూచనల మేర కు బూత్ లెవెల్ కమిటీలను ఏర్పాటు చేశామన్నారు.
కార్యకర్తలందరూ టీడీపీ అవినీతి అక్రమాలను ప్రజలకు వివరించాలని సూచించారు. అనంతరం పార్టీ జిల్లా వ్యవహారాల సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు( చిన్నశ్రీను) మాట్లాడుతూ, పార్టీ అప్పగించిన బాధ్యతను కమిటీ సభ్యులు చిత్తశుద్ధితో నిర్వహించాలని సూచించారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా పని చేసినప్పుడే 2019లో విజయం ఖాయమని స్పష్టం చేశారు. కేంద్ర పాలకమండలి సభ్యుడు, మాజీ మంత్రివర్యులు పెనుమత్స సాంబశివరాజు మాట్లాడుతూ, పార్టీ బలోపేతానికి ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు కేవీ సూర్యనారాయణరాజు, డీసీఎంఎస్ చైర్మన్ ఎస్వీ రమణరాజు, అంబల్ల శ్రీరాములునాయుడు, నారాయణమూర్తిరాజు, తాడ్డె వేణుగోపాలరావు, కోట్ల విశ్వేశ్వరరావు, కోట్ల మోతీలాల్‌నాయుడు, బూర్లె నరేష్‌కుమార్, కర్రోతు నాగేశ్వరరావు, ఏఎంసీ చైర్మన్ కేఎస్‌ఆర్‌కే ప్రసాద్, సర్పంచ్‌లు బాలి బంగారునాయుడు, మండల సత్యనారాయణ, పిన్నింటి సుగుణాకరరావు, ఎంపీటీసీ సభ్యులు పప్పల కృష్ణమూర్తి, శివాజీరాజు, తాడేల ఉమామహేశ్వరరావు, చీపురుపల్లి నాయకులు ఇప్పిలి అనంతం, వలిరెడ్డి శ్రీనివాసనాయుడు, తదితరులు పాల్గొన్నారు.