ఓటుకు నోటు కేసులో సాక్ష్యాధారాలతో అడ్డంగా దొరికిపోయిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఏపీలో ప్రధాన ముద్దాయిగా నిలిచారని
ఎమ్మెల్సీ శేషుబాబు విమర్శ
పూలపల్లి (పాలకొల్లు అర్బన్) : ఓటుకు నోటు కేసులో సాక్ష్యాధారాలతో అడ్డంగా దొరికిపోయిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఏపీలో ప్రధాన ముద్దాయిగా నిలిచారని ఎమ్మెల్సీ మేకా శేషుబాబు ధ్వజమెత్తారు. పూలపల్లిలో శుక్రవారం తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాటారు.
ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోవడంతో ఏపీకి ప్రత్యేక హోదా విషయంలోగాని, విశాఖపట్టణానికి ప్రత్యేక రైల్వేజోన్ ఏర్పాటు విషయంలో గాని కేంద్రంపై ఒత్తిడి తేలేక రాష్ట్ర ప్రజలకు తీరని ద్రోహం చేశారని మండిపడ్డారు. తొమ్మిదేళ్లుగా ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబునాయుడు పాలనాకాలంలో అనేక అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నారని, వాటిపై కోర్టులకెళ్లి స్టేలు తెచ్చుకుని విచారణ జరగకుండా నిలుపుదల చేసుకున్నారని ఆరోపించారు.
చంద్రబాబు నిజాయితీ పరుడైతే తనపై వచ్చిన విచారణకు సిద్ధం కావాలని, అలాకాకుండా కోర్టు కెళ్లి ఎందుకు స్టేలు తెచ్చుకున్నారని శేషుబాబు ప్రశ్నించారు. అనేక కేసుల్లో స్టేలు తెచ్చుకుని విచారణలు నిలుపుదల చేయించుకున్న చంద్రబాబు స్టే వీరుడుగా ప్రసిద్ధి చెందారని విమర్శించారు. ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చని ముఖ్యమంత్రిగా చంద్రబాబే ప్రజలముందు అసలు ముద్దాయిగా నిలబడ్డారని ఎద్దేవా చేశారు.
ప్రతిపక్షనేతగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజాసమస్యలపై అధికారపక్షాన్ని నిలదీయడాన్ని సహించలేక ఆయనపై అవాస్తవాలు, అభూత కల్పితాలతో ఆరోపణలు చేయడం అధికార పక్ష సభ్యులకు తగదన్నారు. జగన్ ఎదుర్కొంటున్నవి కేవలం ఆరోపణలే తప్ప నేరం రుజువు కాలేదన్నారు. నేరం రుజువు కాకుండానే జగన్‌ని ముద్దాయి అనడం రాజకీయ దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు. పార్టీ మండల కన్వీనర్ మైలాబత్తుల మైఖేల్‌రాజు, నడపన గోవిందరాజులనాయుడు, విన్‌స్టన్‌బాబు పాల్గొన్నారు.