
ఏపీలో నాలుగు ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్
ఎమ్మెల్యేల కోటాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనమండలికి జరుగనున్న ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది.
హైదరాబాద్:ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనమండలిలో ఎమ్మెల్యే కోటాలో ఖాళీగా ఉన్న నాలుగు ఎమ్మెల్సీ స్థానాలకు జరిగే ఎన్నికల నోటిఫికేషన్ ను గురువారం విడుదల చేశారు. రాష్ట్ర విభజనతో శాసనమండలిలో పెరిగిన మూడింటితోపాటు పాలడుగు వెంకట్రావు మృతితో ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. జూన్ 1వ తేదీన ఎమ్మెల్సీ ఎన్నికలను నిర్వహించనున్నట్లు ఎన్నికల అధికారులు స్పష్టం చేశారు. దీనిలో భాగంగా ఈనెల 21 వ తేదీ వరకూ నామినేషన్ల స్వీకరణ ఉండగా, 22 న నామినేషన్ల పరిశీలన కార్యక్రమం ఉంటుంది. అనంతరం మే 25 వ తేదీన నామినేషన్ల ఉప సంహరణ కార్యక్రమం ఉంటుంది.
జూన్ 1 వ తేదీన నిర్వహించే పోలింగ్ ఉదయం 9గంటలకు ప్రారంభమై.. సాయంత్రం 4 గంటలకు ముగుస్తుంది. అదే రోజు ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలను విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు.