డీసీ గోవిందరెడ్డికి ఎమ్మెల్సీ పదవి ఖరారు
సంబరాలు జరుపుకున్న అభిమానులు
బద్వేలు(అట్లూరు) : మాజీ ఎమ్మేల్యే డీసీ గోవిందరెడ్డికి ఎమ్మెల్సీ పదవి ఖరారు కావడంతో బద్వేలు నియోజకవర్గంలోని ఆయన అనుచరులు, వైఎస్‌ఆర్‌సీపీ శ్రేణుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. కాశినాయన మండలం వరికుంట్ల గ్రామానికి చెందిన గోవిందరెడ్డి, లక్షుమ్మ దంపతుల మొదటి సంతానం దేవసాని చిన్న గోవిందరెడ్డి. వీరిది వ్యవసాయ కుటుంబమైనప్పటికి చిన్నప్పటి నుండి గోవిందరెడ్డి చదువులో దిట్ట. డిప్యూటీ ట్రాన్సుపోర్ట్ కమిషనర్‌గా ఉద్యోగం చేస్తూ వైఎస్ రాజశేఖరరెడ్డి పట్ల ఉండే అభిమానంతో రాజకీయాల్లోకి వచ్చారు.
వైఎస్ ఆశీస్సులతో 2004లో బద్వేలు ఎమ్మేల్యేగా గెలుపొందారు. తనదైన శైలిలో అందరికీ అందుబాటులో ఉంటూ నియోజకవర్గ ప్రజల మనస్సులో చెరగని ముద్ర వేసుకున్నారు. వైఎస్‌కు సన్నిహితునిగా మెలిగారు. బద్వేలు నియోజకవర్గం 2009లో ఎస్సీలకు రిజర్వ్ కావడంతో ఆ సీటును కమలమ్మకు కేటాయించారు. గెలుపు భారాన్ని తన భుజస్కందాలపై వేసుకుని కమలమ్మను గెలిపించారు. వైఎస్ మరణానంతరం ఆయన కుమారుడు జగన్‌మోహన్‌రెడ్డికి మరింత చేరువయ్యారు.
గత ఏడాది జరిగిన ఎన్నికల్లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తిరువీధి జయరాములును గెలిపించుకోవడంలో తనదైన శైలిలో కీలక పాత్ర పోషించారు. వైఎస్‌ఆర్‌సీపీ కేంద్ర పాలక మండలి సభ్యుడిగా కొనసాగుతూ పార్టీ అభివృద్ధికి కృషి చేస్తున్నారు. ఆయన సేవలను గుర్తించిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతో నియోజకవర్గం వ్యాప్తంగా శనివారం పార్టీ శ్రేణులు, అభిమానులు సంబరాలు జరుపుకున్నారు.
నమ్మకానికి పెద్దపీట
Published Sun, May 10 2015 3:05 AM | Last Updated on Fri, May 25 2018 9:20 PM