రక్త పిశాచాలు వచ్చేశాయ్‌..! | Monsoon Diseases By Mosquito | Sakshi
Sakshi News home page

రక్త పిశాచాలు వచ్చేశాయ్‌..!

Published Fri, Jul 26 2019 9:16 AM | Last Updated on Fri, Jul 26 2019 9:16 AM

Monsoon Diseases By Mosquito - Sakshi

సాక్షి, దర్శి టౌన్‌: వర్షాకాలం.. వ్యాధుల వ్వాప్తికి అనువైనది. ఎక్కడికక్కడ వర్షం నీరు, మురుగు నిల్వ ఉండటంతో దోమలు వ్వాప్తి చెందుతాయి. జనంపై దాడి చేస్తాయి. వ్యాధుల వ్వాప్తికి కారణం అవుతాయి. దోమల నివారణలో ఆరోగ్య శాఖ, పంచాయతీరాజ్‌ శాఖలు ఏమాత్రం అలక్ష్యం చేసినా అతిసారా, డయేరియా, చికున్‌ గున్యా, విషజ్వరాలు ప్రబలే అవకాశాలు ఉన్నాయి. పారిశుధ్యం మెరుగుపరచని కారణంగా 2017లో జిల్లాలో 1.10 లక్షల మంది విషజ్వరాల బారిన పడ్డారు. మొత్తం 71 మందికి పైగా మరణించారు. ఈ నేపథ్యంలో వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రతతోనే వ్యాధులను నివారించవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. 

దోమల సంతానోత్పత్తి ఇలా.. 
నిల్వ ఉన్న మురుగు నీటిలో దోమలు జీవిస్తాయి. 
► వర్షాకాలంలో గుడ్లు పెట్టి సంతానోత్పత్తితో వృద్ధి చెందుతాయి. 
► దోమ జీవిత కాలం 40 నుంచి 60 రోజులు ఉంటుంది. 
► ఒక దోమ జీవిత కాలంలో సుమారు పది వేల గుడ్లు పెడుతుంది. 
► గుడ్ల దశ నుంచి దోమగా మారడానికి కేవలం 10 నుంచి 12 రోజలు పడుతుంది.  
► ఆడ దోమలే మనుషులను కుడతాయి. వ్యాధుల వ్వాప్తికి ఆడ దోమలే కారణం.

దోమల వల్ల వచ్చే వ్యాధులు
దోమలు కుట్టడం వల్ల మలేరియా, డెంగీ, చికున్‌గున్యా, ఫైలేరియా, మెదడు వాపు వ్యాధులు సోకుతాయి. ప్లాస్మోడియం, ఫాల్లిఫారం అనే పరాన్న జీవి కలిగి ఉన్న ఆడ ఎనాఫిలిస్‌ దోమ కుట్టడం వల్ల మలేరియా వస్తుంది. చలితో కూడిన జ్వరం దీని లక్షణం. సకాలంలో స్పందించి వైద్య సేవలు పొందకపోతే మరణించే అవకాశాలూ లేకపోలేదు.

చికున్‌ గున్యా 
ఈ వ్యాధి కూడా నీటి నిల్వలో పెరిగే ఈజిప్ట్, టైగర్‌ దోమల వల్ల వస్తుంది. తీవ్రమైన జ్వరాలు, కీళ్లనొప్పులు, ఒళ్లు నొప్పులు వస్తాయి. మందులు వాడితే తగ్గినట్టుండి మళ్లీ వస్తుంది. వైద్యుని పర్యవేక్షణలో చికిత్స పొందాలి.

డెంగీ 
మంచినీరు, మురుగు నీటిలో పెరిగిన ఏడిస్‌ ఈజిప్ట్‌ అనే దోమ లేదా టైగర్‌ దోమ కుట్టడం వల్ల డెంగీ సోకుతుంది. డెంగీ హేమరేజస్‌ ఫీవర్, డెంగీ షాక్‌ సిండ్రోమ్‌కు గురైతే మరణాలు సంభవించే అవకాశాలు ఉన్నాయి. ఈ వ్యాధి సోకితే తీవ్రమైన జ్వరం, శరీరం ఎర్రగా కందిపోయి దద్దుర్లు రావడం, కళ్లు కదిలించలేక పోవడం, ఒళ్లు, కండరాల నొప్పులు, సాధారణ వాంతులు, రక్తం వాంతులు అవుతాయి. రక్తంలో ప్లేట్‌లెట్ల సంఖ్య తగ్గిపోతుంది. వ్యాధిగ్రస్తుడు వైద్యుల పర్యవేక్షణలో ఉండాల్సి వస్తుంది. వ్యాధి నయం అయ్యే వరకు మందులు వాడాలి.

మెదడు వాపు
క్యూలెక్స్‌ దోమ కుట్టడం వల్ల వస్తుంది. ఈ వ్యాధి చిన్నపిల్లలకు ఎక్కువగా సంక్రమిస్తుంది. ఈ వ్యాధి వల్ల కళ్లు తిరగడం, రోగి అపస్మారక స్థితిలోకి వెళ్లడం జరుగుతుంది. కదల్లేని నిస్సహాయ స్థితికి చేరుకుంటారు. పందులకు కుట్టిన వ్యాధికారక వైరస్‌ దోమలు మనుషులకు కుట్టడం వల్ల వ్యాధి సంక్రమిస్తుంది. 

నివారణ ఇలా.. 
పరిశుభ్రమైన వాతావరణం కలిగి ఉండాలి. మురుగు నీరు నిల్వ లేకుండా చూసుకోవాలి. పరిసరాల్లో చెత్తాచెదారం, పేడదిబ్బలు దూరంగా వేయాలి. కొబ్బరి బొండాలు, పాత టైర్లు, వినియోగించని మట్టి పాత్రలు, పూల కుండీలు, దోమలు అభివృద్ధి చెందే పనికిరాని పరికరాలు ఇళ్లకు దూరంగా ఉంచుకోవాలి. ఇంట్లో ఫ్రిజ్, కూలర్లు ఎప్పటికప్పుడు శుభ్రపరచాలి. ప్రతి శుక్రవారం డ్రైడే పాటించి వస్తువులను ఎండబెట్టడం ద్వారా దోమలను నివారించుకోవచ్చు. దోమలు నివాసాల్లోకి రాకుండా కిటికీలు, తలుపులు సాయంత్రం మూసివేయాలి. దోమల నిర్మూలనకు కాయిల్స్‌ వాడాలి.

అప్రమత్తం చేశాం
ఇప్పడిప్పుడే వర్షాలు కురుస్తున్నాయి. సీజనల్‌ వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. ఎటువంటి అనారోగ్యానికి గురైనా సమాచారం అందించి వైద్యసేవలు పొందాలని సూచిస్తున్నాం.
– బి.రత్నం, పీహెచ్‌సీ వైద్యాధికారి, తూర్పుగంగవరం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement