అభిమానాన్ని అడ్డుకోలేరు
Published Sun, Nov 17 2013 1:54 AM | Last Updated on Sat, Jul 6 2019 12:52 PM
సాక్షి, గుంటూరు/ రేపల్లె,న్యూస్‌లైన్ :కాంగ్రెస్ అధిష్టానం సీబీఐతో తననూ, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని అరెస్టు చేసి భౌతికంగా ఇబ్బందుల పాలు చేసినా ప్రజల అభిమానాన్ని మాత్రం దూరం చేయలేకపోయిందని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ నేత మోపిదేవి వెంకటరమణపేర్కొన్నారు. న్యాయస్థానంపై తనకు గౌరవం ఉందన్నారు. నిజమేంటో తమ ఆత్మసాక్షికి తెలుసని చెప్పారు. రేపల్లె నెహ్రూసెంటర్‌లో శనివారం నియోజకవర్గ పార్టీ నాయకులు, వైఎస్సార్ సీపీ అభిమానులు ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మోపిదేవి తీవ్ర ఉద్వేగంతో ప్రసంగించారు. తన అరెస్టు తరువాత తన ఇంటికొచ్చి భార్యాపిల్లలు, బంధువులకు భరోసా మాటలు చెప్పిన సీఎం, ఇతర మంత్రులు కొద్ది రోజుల తర్వాత ‘రమణ మనవాడు కాడన్న’ నిర్ణయానికొచ్చారని పేర్కొన్నారు.
కేసుల విషయంలో తాను చేసిన తప్పేంటో, ఆరోపణలు ఎదుర్కొన్న మిగతా మంత్రులు చేసిన ఒప్పేంటో తెలియడం లేదన్నారు. ప్రజల కోసం ఏదో ఒక మంచి పని చేయాలనుకున్నా. అదే తప్పంటే ఏం చేస్తామని ఆయన ప్రశ్నించారు. నేడేమో బెయిల్ వస్తే దాన్ని కూడా రాజకీయ కోణంలో చూస్తున్నారని కాంగ్రెస్ నేతలపై మండిపడ్డారు బహింగ సభకు అధ్యక్షత వహించిన జిల్లా పార్టీ కన్వీనర్ మర్రి రాజశేఖర్ మాట్లాడుతూ, జగన్ నాయకత్వం రాష్ట్రానికెంత అవసరమో, రేపల్లె నియోజకవర్గానికి మోపిదేవి సారథ్యం అంతే అవసరమన్నారు.
కేంద్ర మాజీ మంత్రి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రజల ఆదరణే జగన్‌ను, మోపిదేవిని విజయపథాన నడిపిస్తాయన్నారు. జిల్లా పార్టీకి సమర్థుడైన బీసీ నాయకుడు దొరికారని పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు జ్యోతుల నెహ్రూ పేర్కొన్నారు. పార్టీ అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకరరావు మాట్లాడుతూ, ఎన్ని ఇబ్బందులు వచ్చినా తట్టుకునే సత్తా, మనోైధైర్యం వైఎస్ జగన్‌కు ఉన్నాయన్నారు. ఈ సభలో పార్టీ నాయకులు లేళ్ల అప్పిరెడ్డి, కావటి మనోహర్‌నాయుడు, మేరిగ విజయలక్ష్మి, రాతంశెట్టి రామాంజనేయులు, మందపాటి శేషగిరిరావు, మోదుగల బసవపున్నారెడ్డి, దాది లక్ష్మీరాజ్యం, డాక్టర్ రూత్‌రాణి, మేరుగ నాగార్జున,షేక్ షౌకత్, నసీర్ అహ్మద్ తదితరులు ప్రసంగించారు. పలువురు నాయకులు పాల్గొన్నారు.
అభిమాన నేతకు ఘన స్వాగతం
వైఎస్సార్ సీపీలో చేరిన మాజీ మంత్రి మోపిదేవి వెంకట రమణకు ఘనస్వాగతం లభించింది. శనివారం మధ్యాహ్నం ఒంటిగంటకు గన్నవరం ఎయిర్‌పోర్టులో దిగిన వెంకటరమణను పార్టీ కార్యకర్తలు ఊరేగింపుగా రేపల్లెకు తోడ్కొని వచ్చారు. పట్టణ వీధులన్నీ మోపిదేవి బ్యానర్లు, ఫ్లెక్సీలతో నిండిపోయాయి. ప్రధాన కూడళ్లన్నీ కిటకిటలాడాయి. బాణా సంచా పేలుళ్లతో పట్టణమంతా హోరెత్తిపోయింది. ఆ తరువాత ఆయన బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు కొమ్మూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆధ్వర్యంలో గజమాల, పూల కిరీటాలతో మోపిదేవిని ఘనంగా సత్కరించారు.
పార్టీలో చేరిక ..
మోపిదేవి సమక్షంలో పలువురు నియోజకవర్గ ప్రముఖులు వైఎస్సార్ సీపీలో చేరారు. నర్రా సుబ్బయ్య, తూము కోటేశ్వరరావు, నల్లపాటి రామయ్య, దొంతుబోయిన వెంకటేశ్వరరెడ్డి, పూషడపు సాంబశివరావు, బండారు రామారావు తదితరులు చేరారు.
Advertisement