విశాఖపట్నం-మెడికల్,న్యూస్‌లైన్ :
పాప పుడితే రూ.500, బాబు అయితే వెయ్యి,, ఇదేమిటా అని అనుకుంటున్నారా.. కేజీహెచ్ ప్రసూతి వార్డులో సిబ్బంది, నర్సులకు బాలింతల బంధువులు ముట్టజెప్పాల్సిన ‘బహుమతి’. నిరుపేదలకు పెన్నిధి లాంటి పెద్దాస్పత్రికి పురుడు పోసుకునేందుకు వస్తున్న వారికి ఎదురవుతున్న ఈ మామూళ్ల వ్యవహారం పెద్ద భారంగా పరి ణమించింది. లేబర్ రూమ్, ఆపరేషన్ థియేటర్ సిబ్బంది, నర్సులు గర్భిణుల నుంచి ఈ నిర్బంధ వసూళ్లను నిర్భీతిగా వసూలు చేస్తున్నారని వారి బంధువులు ఆరోపిస్తున్నారు.
ప్రసవం జరిగిన వెంటనే సిబ్బంది మగబిడ్డ పుడితే వెయ్యి రూపాయలు, ఆగపిల్ల అయితే రూ.500 ఆనవాయితీగా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక్కడికి వచ్చే నిరుపేద, మధ్యతరగతి వారు తమ సంతోషం కొద్దీ సిబ్బందికొంత మొత్తం ఇస్తే దాన్ని తీసుకోకుండా తాము అడిగినంతా ఇవ్వకపోతే బిడ్డను చూపించకుండా నానా ఇబ్బంది పెడుతున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారంపై అధికారులకు ఫిర్యాదు చేసినా విచారణ జరిపి బాధ్యులపై కఠినంగా చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు.
అధికారులు అడ్డు కట్టవేయాలి
నా కుమార్తెను పురుడు కోసం గైనిక్ వార్డులో చేర్చాను. శనివారం సిజేరియన్ ఆపరేషన్ చేశారు. మగబిడ్డను పుట్టింది. బిడ్డను చూపించాలని అడిగాను. మీ కుమార్తెకు మగబిడ్డ పుట్టాడు రూ.1300 ఇవ్వాలని లేబర్ రూమ్ ఓటీ సిబ్బంది డిమాండ్ చేశారు. నాది నిరుపేద కుటుంబం, నా దగ్గర రూ.300 ఉన్నాయన్నాను. వెయ్యికి తక్కువయితే బిడ్డను చూపించేది లేదని బెదిరించారు. దీంతో చేసేది లేక ఆర్‌ఎంఓకు ఫిర్యాదు చేశాను. ఆయన జోక్యంతో డబ్బులు తీసుకోకుండా వదిలేశారు. ఈ నిర్బంధ వసూళ్లకు అధికారులు అడ్డుకట్టవేయాలి. -లక్ష్మణరావు, బాలింత తండ్రి
పూర్తిస్థాయిలో ఆరా తీస్తా
ప్రసూతి వార్డులో సిబ్బంది నిర్బంధ వసూళ్లు చేస్తున్నారని బాలింత బంధువు నాకు ఫిర్యాదు చేశాడు. దీనిపై లేబర్ రూమ్ హెడ్ నర్సును అడిగాను. సోమవారం ఈ విషయం పై పూర్తిస్థాయిలో ఆరా తీస్తాను. బాధ్యులపై చర్యలు తీసుకునేందుకు సూపరింటెండెంట్‌కు నివేదిక అందజేస్తాను.
- డాక్టర్ శాస్త్రి, డీసీఎస్ ఆర్‌ఎంఓ, కేజీహెచ్
క్యార్ మంటే కరెన్సీ!
Published Mon, Jan 20 2014 3:17 AM | Last Updated on Thu, Sep 19 2019 2:50 PM
Advertisement