తల్లీకూతుళ్ల ఆత్మహత్య
తల్లీకూతుళ్ల ఆత్మహత్య
ఉన్న ఊరు వదిలి కూలీ పనులు చేసి పిల్లలను ప్రయోజకులను చేద్దామని ఆశించింది తల్లి... తల్లిదండ్రులు పడుతున్న కష్టాలను భవిష్యత్‌లో తానైనా అధిగమించాలని భావించింది కూతురు.
కానీ విధి ఆడిన నాటకంలో తల్లీకూతుళ్లు విగతజీవులుగా మారారు. ఇంటి పెద్ద వేధింపులు వారిద్దరూ ఊపిరి తీసుకునేలా చేశాయి. విషపు గుళికలు మింగి తల్లీకూతుళ్లు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మంగళవారం మండలంలోని గుండంపల్లి గ్రామంలో చోటు చేసుకుంది.
ుండంపల్లి(దిలావర్‌పూర్), :
నిజామాబాద్ జిల్లా సిరికొండ గ్రామానికి చెందిన పస్తం సాయన్న తన భార్య లక్ష్మి, ముగ్గురు పిల్లలతో కలిసి ఐదేళ్ల క్రితం మండలంలోని గుండంపల్లి గ్రామానికి బతుకుదెరువు కోసం వలస వచ్చాడు. గుడిసె వేసుకుని.. కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు.
సాయన్న కొంతకాలంగా మద్యం సేవిస్తూ తన భార్య లక్ష్మిని తరచూ వేధిస్తున్నాడు. ఐదు రోజుల క్రితం అతిగా మద్యం సేవించి తాను పురుగుల మందు తాగానంటూ కుటుంబ సభ్యులతోపాటు 108సిబ్బందిని ఆటపట్టించాడు. పురుగుల మందు తాగలేదంటూ కుటుంబ సభ్యులను వేధించడం మొదలుపెట్టాడు.
దీంతో లక్ష్మి తీవ్ర మనస్తాపానికి గురైంది. సాయన్న చిన్న కుమారుడు సాయికుమార్‌తో కలిసి వేరే గ్రామానికి వెళ్లాడు. మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో లక్ష్మి(35) విషపు గుళికలు తిని తన కూతురు లావణ్య(12)కు తినిపించింది.
రెండు గంటల సమయంలో మరో కుమారుడు సింహాంద్రి(7) చూసి ఇరుగుపొరుగు వారికి చెప్పాడు. అక్కడికి చేరుకున్న గ్రామస్తులు పరిశీ లించగా అప్పటికే లక్ష్మి మృతిచెందింది. 108 సిబ్బంది వచ్చేసరికి లావణ్య కూడా చనిపోయింది. లావణ్య స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏడో తరగతి చదువుతోంది. కుటుంబ కలహాలే ఆత్మహత్యకు కారణమని గ్రామస్తులు తెలిపారు. సంఘటన స్థలాన్ని రూరల్ సీఐ రఘు, నర్సాపూర్(జి) ఎస్సై అనిల్ పరిశీలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు