వాళ్లకి ఆడ పిల్లలంటే చిన్నచూపు. మగబిడ్డ కోసం ఎంతమంది ఆడపిల్లల్ని అయినా కనేలా ఒత్తిడి చేస్తుంటారు. తొమ్మిది కాన్పుల వరకు మగబిడ్డ కోసం చూడటం.. అప్పటికీ పుట్టకపోతే మరో పెళ్లికి సిద్ధమవడం మగవారికి సర్వసాధారణం. ప్రసవం కోసం గర్భిణుల్ని ఆస్పత్రి గడప తొక్కనివ్వవు వారి కట్టుబాట్లు. గత్యంతరం లేక ఇంట్లోనే ప్రసవాలతో మాతా, శిశు మరణాల సంఖ్య పెరుగుతోంది. ఎటు చూసినా వెనుకబాటు తనం.. నిరక్షరాస్యత.. అధిక సంతానం.. అవగాహనా రాహిత్యం.. మూఢ నమ్మకాలు వెరసి ఆ పల్లెల బతుకు చిత్రాన్ని దయనీయంగా మార్చింది. దీనివల్ల ఎన్నెన్నో కుటుంబాలు పేదరికంలో కొట్టుమిట్టాడున్నాయి. బుక్కెడు బువ్వ కోసం వలస బాట పడుతున్నాయి. ఆరు జిల్లాల సాగు, తాగునీటి అవసరాల తీర్చే జల వనరుల రాజధాని.. శ్రీశైలం, మంత్రాలయం, అహోబిలం, మహానంది, యాగంటి లాంటి పుణ్య క్షేత్రాలు గల ఆధ్యాత్మిక భూమి కర్నూలు పల్లెల్లో ఇలాంటి దారుణ పరిస్థితులు నెలకొన్నాయి.
కౌతాళం మండలం హల్వి గ్రామానికి చెందిన ఈమె పేరు లలితమ్మ (వృత్తంలో). ముత్తన్న అనే వ్యక్తిని వివాహమాడింది. ఈమెకు 8 మంది ఆడపిల్లలు. కుటుంబ నియంత్రణ ఆపరేషన్ ఎందుకు చేయించుకోలేదని ప్రశ్నించగా.. ‘మగబిడ్డ కోసమయ్యా!’ అని బదులిచ్చింది.
మద్యానికి బానిసైన ముత్తన్న అనారోగ్యంతో మరణించడంతో కుటుంబ భారం లలితమ్మపైనే పడింది. అంతమంది పిల్లల్ని కంటే కుటుంబాన్ని పోషించడం కష్టం కాదా అని అడిగితే.. ‘ఏమో అయ్యా! సెప్పేవారెవరూ లేకపోతిరి. మాకు సదువు రాదు. అంతే!’ అంది. ఇదే మండలంలోని మరిలి గ్రామానికి చెందిన మరియమ్మకు ఏడుగురు ఆడ పిల్లలు. జమ్మాలదిన్నెకు చెందిన హైమవతికి నలుగురు ఆడ బిడ్డలు కాగా.. ఆమె ప్రస్తుతం 7 నెలల గర్భిణి. అదే గ్రామంలోని శ్రీదేవికి ఐదుగురు ఆడబిడ్డలు, ముచ్చుగిరికి చెందిన మంగమ్మకు ఏకంగా 10 మంది సంతానం. వారిలో 9 మంది ఆడబిడ్డలే. ఏ గ్రామానికి వెళ్లినా ఇలాంటి కుటుంబాలు భారీగానే ఉన్నాయి.
సాక్షి ప్రతినిధి/కర్నూలు : తొలి కాన్పునకు పుట్టింటికి తీసుకెళ్లడం సార్వసాధారణం. కానీ.. కోసిగి, మంత్రాలయం, కౌతాళం, పెద్దకడుబూరు మండలాలతో పాటు సమీపంలోని చాలా గ్రామాల్లో మహిళలు తొలి కాన్పు, బిడ్డ జననం పుట్టింట్లోనే జరగాలి. ఆస్పత్రికి వెళ్లకూడదనే నిబంధన పెట్టుకున్నారు. దీంతో గర్భిణులకు వైద్య పరీక్షలు ఉండవు. కడుపులో బిడ్డ ఆరోగ్యంగా ఉందా.. లేదా, గర్భిణి ఆరోగ్య పరిస్థితి ఏమిటనేవి పట్టించుకోరు. దీంతో బలహీనంగా, అనారోగ్య సమస్యలతో పుట్టే పిల్లలు కూడా ఎక్కువే. కాన్పు సమయంలో ఆస్పత్రికి వెళ్లకపోవడంతో ఇబ్బందిపడిన మహిళలు ఎందరో ఉన్నారు. ఇదేంటని ఆరా తీస్తే ‘ఆస్పత్రికి వెళితే ఆపరేషన్ చేస్తారు. ఒకసారి ఆపరేషన్ అయితే సాధారణ కాన్పు జరగదు. పైగా ఒక బిడ్డకు మాత్రమే అవకాశం ఉంటుంది. తొలి ఇద్దరు ఆడపిల్లలైతే మళ్లీ కాన్పునకు అవకాశం ఉండదు. అందుకే ఆస్పత్రికి వెళ్లకుండా ఇంట్లోనే కాన్పు చేసుకుంటాం’ అని చెబుతున్నారు. దీన్నిబట్టే ఇక్కడి ప్రజలు ఎంత అమాయకంగా, అనాగరికంగా అవగతం చేసుకోవచ్చు. వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు ఇక్కడి ప్రజలను కలిసి.. వారికి ఆస్పత్రి, చికిత్స, ఆరోగ్యంపై అవగాహన కల్పించి.. ఆస్పత్రులకు రప్పించడంలో ఘోరంగా విఫలమవుతున్నారు.
నిరక్షరాస్యతలో మొదటి స్థానం
మంత్రాలయం నియోజకవర్గంలోని కోసిగి మండలం నిరక్షరాస్యతలో రాష్ట్రంలోనే మొదటి స్థానంలో, దేశంలో మూడో స్థానంలో ఉంది. 2011 జనాభా లెక్కల ప్రకారం కర్నూలు జిల్లాలో నిరక్షరాస్యతలో మొదటి 10 స్థానాల్లో ఉన్న మండలాలివీ..
సుగ్గికెళితే కొంచెం ఎక్కువ
బిడ్డల చదువు విషయమై కొందరి తల్లులను అడగ్గా.. ‘ఆడబిడ్డకు సదువెందుకయ్యా. కూలికి పోతే నూట యాభై వస్తాది. సుగ్గికి పోతే ఇంగా ఎక్కువొత్తాది!’ అన్నారు. ఈ ప్రాంతం నుంచి ఎక్కువ మంది బెంగళూరు వలస (సుగ్గి) పోతున్నారు. అక్కడ ఇళ్లు, వీధుల్లో స్వీపర్లుగా.. భవన నిర్మాణ కూలీలుగా.. వృద్ధులైతే ఇళ్లు, దుకాణాల వద్ద వాచ్‌మన్‌లుగా పని చేస్తున్నారు. కొందరు మహిళలు వేరుశనగ, శనగ గుగ్గిళ్లను రైళ్లలో విక్రయిస్తున్నారు. కొందరు పిల్లలు భిక్షాటన కూడా చేస్తున్నారు. రాత్రి 8 గంటలకు కోసిగి రైల్వే స్టేషన్‌లో ఇలాంటి వారు కనీసం 600 మంది రైలు దిగుతుంటారు.
ఆస్పత్రికి పోదామంటే డబ్బుల్లేవు
నాకు నలుగురు బిడ్డలు. 3, 4వ సంతానమైన షర్మిల (7), దివ్య (5)మూగవారు. ఆస్పత్రికి తీసుకెళ్దామంటే డబ్బుల్లేవు. ఏం సేస్తాం. మా బతుకులు ఇంతే. మమ్మల్ని పట్టించుకునేటోళ్లు లేరు. అందుకే ఇలా ఉండిపోయినాం.
– ప్రమీల, జమ్మాలదిన్నె, కోసిగి మండలం
చెల్లి కోసం బడికెళ్ల లేదు
ఊయల ఊపుతున్న ఈ చిన్నారి పేరు దీపిక. తలారి రామంజనేయులు, లక్ష్మీదేవి ఈమె తల్లిదండ్రులు. వీరికి నలుగురు ఆడపిల్లలు. దీపిక పెద్దమ్మాయి. మధ్యాహ్యం 12.50 గంటలకు ఇంటివద్ద ఇలా కన్పించింది. ‘బడికి వెళ్లలేదా తల్లీ’ అని అడిగితే.. ‘సెల్లిని సూసుండేందుకు ఇంటికాడే ఉంటన్నా’ అని సమాధానమిచ్చింది. తల్లిదండ్రులు కూలి పనికి వెళ్తే.. చిన్న పిల్లలను చూసుకునేందుకు పెద్ద పిల్లలు బడి వదిలేసి ఇంటి వద్దే ఉంటారు. ఇలా దీపిక మాత్రమే కాదు.. చాలా మంది పిల్లలు బడికి వెళ్లకుండా చెల్లెళ్ల ఆలనా పాలన కోసం అక్షరాలకు దూరంగా భవిష్యత్‌ను బుగ్గిపాలు చేసుకుంటున్నారు.
రైళ్లలోనూ ఇబ్బందులే
నాకు ఇద్దరు కొడుకులు, ఇద్దరు ఆడ బిడ్డలు. రెండెకరాల సేనుంది. వానల్లేక, పంటలు పండక శానా ఇబ్బంది పడుతున్నాం. కూలికి పోదామన్నా పని ఉండదు. రైళ్లలో పండ్లు అమ్ముకుంటాం. రైలులో శానా ఇబ్బంది. పరిమిషన్ లేదని టీసీలు దించేస్తారు. కిందమీద పడతా బతుకుతాండాం.
– రాగమ్మ, కోసిగి
తిండిలేక.. ఎదుగదల లేక
పెండ్లయిన ఏడాదికే భర్త శీను ఇడిసిపెట్టి పోయినాడు. ఇల్లు లేదు. పొలం లేదు. బెంగళూరుకు సుగ్గి పోతాం. బిడ్డను చూసుకునేటోళ్లు లేక నాతోపాటు తీసుకుపోతా. దీంతో పాపకు సదువు పోయినాది. 11 ఏళ్ల బిడ్డయినా తిండిలేక ఎదుగుదల ఆగిపోయినాది.
– భీమక్క, కర్నూలు పశ్చిమ ప్రాంతం
చదువుకోవాలని ఉంది..కానీ
నేను ఒకటో తరగతి సదివినా. ఓ చెల్లెలు, తమ్ముడు ఉన్నారు. అమ్మవాళ్లు సుగ్గికి పోతే బువ్వ ఒండేటోళ్లుండరు. అందుకే నేనూ వాళ్లతో సుగ్గికి పోతా. బడికి పోవాలి, మందితో సదువుకోవాలని ఉంటాది కానీ.. ఆ అవకాశం లేదు.
– లక్ష్మి, దేవకోసిగి, కోసిగి మండలం
నేనూ షాకయ్యాను
నేను ఇక్కడ బాధ్యతలు చేపట్టాక వైఎస్సార్ బడిబాట కోసం రిపోర్ట్ రప్పించుకుని చూస్తే నిరక్షరాస్యత ఎక్కువగా ఉందనే విషయం అర్థమైంది. ఆ ప్రాంతాల్లో ఉన్న పేదరికం, వలసలు, మూఢ నమ్మకాలు, మగబిడ్డ కోసం వరుస కాన్పులు చూసి షాక్ అయ్యాను. మంత్రాలయం నియోజకవర్గమే కాదు హాలహర్వి, హోళగంద, చిప్పగిరితో పాటు చాలా మండలాల్లో ఈ సమస్యలు ఉన్నాయి. దీన్ని అధిగమించేందుకు ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేసుకున్నాం. ఈ ప్రాంతంలో చిన్న, మధ్య తరహా పరిశ్రమలు నెలకొల్పి పేదరికాన్ని నిర్మూలించాలనుకున్నాం. అందుకే ఎస్‌హెచ్‌జీ గ్రూపులకు రూ.20 లక్షల నుంచి రూ.కోటి వరకూ రుణాలిచ్చి కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేయించాలని నిర్ణయం తీసుకున్నాం.
– వీరపాండియన్, కలెక్టర్, కర్నూలు
Comments
Please login to add a commentAdd a comment