ఎంతో ఆశపడి, ప్రయత్నించినా చేతికి దక్కకుండా పోయిన రాజ్యసభ టికెట్ వ్యవహారం విషయంలో మోత్కుపల్లి నర్సింహులు పట్టు వీడటం లేదు.
హైదరాబాద్ : ఎంతో ఆశపడి, ప్రయత్నించినా చేతికి దక్కకుండా పోయిన రాజ్యసభ టికెట్ వ్యవహారం విషయంలో మోత్కుపల్లి నర్సింహులు పట్టు వీడటం లేదు. బుధవారం ఉదయం అసెంబ్లీకి వచ్చిన ఆయన ... ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, స్పీకర్ నాదెండ్ల మనోహర్ను కలిసే ప్రయత్నంలో ఉన్నారు. మరోవైపు తెలంగాణ ప్రాంత టీడీపీ నేతలు....మోత్కుపల్లిని పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు వద్దకు తీసుకు వెళ్లే ప్రయత్నం చేయగా ఆయన నిరాకరించారు. ఈ సందర్భంగా మోత్కుపల్లి టీ.టీడీపీ నేతలపై మండిపడ్డారు. రాజ్యసభ రెండు సీట్లు ఆంధ్రావాళ్లకే ఇచ్చినా... అడగలేని దౌర్భాగ్యపు స్థితిలో ఉన్నారని ధ్వజమెత్తారు.
కాగా తాను అనుకున్నట్లు అధినేతను ఆడించేందుకు.. తన పనులు చేయించుకునేందుకు.. ఎదుటి వర్గంపై పైచేయి సాధించేందుకు అలకబూనడం మోత్కుపల్లికి కొత్తేం కాదు, ఇది మొదటిసారి కూడా కాదని ఆ పార్టీ నేతలే విశ్లేషిస్తున్నారు. గతంలో తెలంగాణ ఎమ్మెల్యేలంతా టీటీడీపీ ఫోరం నేత ఎర్రబెల్లి నేతత్వంలో బస్సు యాత్ర చేసిన సమయంలో కూడా ఇదే తరహాలో చెట్టెక్కి కూర్చున్నారు. గతంలో ఓ మారు ఆయన టీడీపీ నుంచి కాంగ్రెస్‌లోకి వెళ్లారు. తిరిగి, టీడీపీకి గూటికి చేరారు. ‘.. ఏమో, ఏమైనా జరగవచ్చు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ, పార్టీ అధినేత ఏమైనా దిద్దుబాటు చర్యలు తీసుకుంటారా..? లేదా అన్నది తేలాల్సి ఉంది.