ప్రముఖ తెలుగు చలన చిత్ర నిర్మాత, మూవీ మొఘల్ దగ్గుబాటి రామానాయుడు మృతితో జిల్లాలోని సినీ అభిమానులు మూగబోయారు. రామానాయుడుకు జిల్లాతో మంచి సంబంధాలు ఉన్నాయి. నెల్లిమర్ల మండలంలోని ఎన్‌సీఎస్ థియేటర్ ప్రారంభోత్సవానికి ఆయన జిల్లాకు వచ్చారు. ఆయన మృతిపై జిల్లా వ్యాప్తంగా ఉన్న అభిమానులు, వెంకటేష్, సురేష్‌బాబు, రానా అసోసియేన్ సభ్యులు, సినీ ఎగ్జిబిటర్ల సంఘం సభ్యులు సంతాపం వ్యక్తం చేశారు.
సినీ రంగానికి తీరని లోటు: మంత్రి మృణాళిని
విజయనగరం కంటోన్మెంట్ : దిగ్గజ నిర్మాత డాక్టర్ దగ్గుబాటి రామానాయుడు ఆకస్మికంగా మృతి చెందడం సినీ రంగానికి తీరని లోటని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, గృహనిర్మాణ శాఖా మంత్రి కిమిడి మృణాళిని తెలిపారు. ఈ మేరకు ఆమె బుధవారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. తెలుగు సినీ రంగంలోనే కాకుండా పలు భాషల్లో ఆయన చిత్రాలు నిర్మించి శత చిత్రాల నిర్మాతగా రికార్డు సృష్టించారని పేర్కొన్నారు. ఎన్టీఆర్, ఏఎన్నార్‌లతో పాటు నేటి తరాల తారలతోనూ చిత్రాలు నిర్మించిన ఘనత ఆయనదని తెలిపారు. ఎంపీగా కూడా సేవలందించి రాజకీయాల్లోనూ చెరగని ముద్ర వేశారని పేర్కొన్నారు.
నిర్మాతల్లో లెజెండ్
సినీ పరిశ్రమకు సంబంధిం చి నిర్మాతల్లో రామానాయుడు ఓ లెజెండ్. ఆయన తీసిన చిత్రం ప్రేమనగర్ మంచి పేరు సంపాదించింది. ఇప్పటి వరకూ అటువంటి మళ్లీ చిత్రం రాలేదు. నెల్లిమర్లలో ఎన్‌సీఎస్ థియేటర్ ప్రారంభానికి వచ్చినప్పుడు ఆయన ‘కళ్లు’ సినిమా చాలా బాగుందని తప్పకుండా చూడమని చెప్పారు. ఎంతో మందిని సినీ రంగానికి పరిచయం చేశారు. ఆయన మృతి నాటక రంగానికి కూడా తీరని లోటు.
- డాక్టర్ ఎ.గోపాలరావు,విజయభావన ప్రధాన కార్యదర్శి
ఇండస్ట్రీకి తీరని లోటు
తెలుగు సినీ చరిత్రలో బ్రాండ్ అంటూ ఉందంటే అది సురేష్ బ్యానర్ ఒక్కటే. ఇటీవలి కాలంలో దృశ్యం సినిమా షూటింగ్ కోసం వచ్చిన సురేష్ బాబు రామానారాయణంను సందర్శించి తన తండ్రిని ఇక్కడకు తీసుకువస్తానని చెప్పారు. కానీ ఇంతలోనే రామానాయుడు మరణించడం బాధాకరం. గతంలో ఆయన థియేటర్ ప్రారంభానికి వచ్చారు. సినీ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ తరఫున ఆయన మృతికి ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తున్నాం.
- నారాయణం శ్రీనివాస్,సినీ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు
కళారంగానికి తీరని లోటు
నూతనంగా సినీ రంగానికి పరిచయం కాబోతున్న వర్ధమాన కళాకారులకు ప్రముఖ సినీ నిర్మాత దగ్గుబాటు రామానాయుడు మృతి తీరని లోటు. ఎందరో నూతన కళాకారులు ఆయన ద్వారా సినీ రంగానికి పరిచయమయ్యారు. కళా, నాటక, సినిమా రంగానికి ఆయన లేని లోటు ఎవరూ తీర్చలేరు.
- మండపాక రవి,ఫ్రెండ్స్ ఫైనార్ట్స్ అసోసియేషన్ కార్యదర్శి
రంగుల ప్రపంచపు రాజు...
రామానాయుడి జీవిత విశేషాలపై నేను రాసిన ‘రంగుల ప్రపంచపు రాజు’ అనే పుస్తకాన్ని 2011 డిసెంబరు 7న హైదరాబాద్‌లో ఆయన ఆవిష్కరించారు. కిన్నెర పబ్లికేషన్స్ ప్రచురించిన ఈ పుస్తకం ఎంతో బాగుందని రామానాయుడు మెచ్చుకున్నారు. ఆయన మృతి అన్ని రంగాల కళాకారులకు తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాం.
- సముద్రాల గురుప్రసాద్, ప్రముఖ రచయిత
తెలుగు సినిమా ధ్రువతార రామానాయుడు
Published Thu, Feb 19 2015 12:57 AM | Last Updated on Tue, Oct 2 2018 2:40 PM
Advertisement
Advertisement