వేటాడి.. వెంటాడి..
♦ భారీగా తరలిస్తున్న ఎర్రచందనాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు
♦ రూ.1.36 కోట్ల విలువైన దుంగలు, మూడు వాహనాలు పట్టివేత
♦ 13 మంది చెన్నై, కర్ణాటక, కేరళకు చెందిన స్మగ్లర్లు, కూలీలు అరెస్ట్
బద్వేలు అర్బన్: భారీగా ఎర్రచందనం దుంగలను తరలిస్తున్న స్మగ్లర్లను పోలీసులు వేటాడి..వెంటాడి పట్టుకున్నారు. బద్వేలు సర్కిల్ పరిధిలోని బద్వేలు, నెల్లూరు జాతీయ రహదారి సమీపంలో గోపవరం ప్రాజెక్టు కాలనీ వద్ద ఆదివారం మూడు వాహనాలతోపాటు కోటి 36 లక్షల 80 వేల విలువైన 33 ఎర్రచందనం దుంగలను వారు స్వాధీనం చేసుకున్నారు. వాటిని తరలిస్తున్న చెన్నై, కర్ణాటక , కేరళలకు చెందిన 13 మంది స్మగ్లర్లు , కూలీలను అరెస్టు చేసినట్లు మైదుకూరు డీఎస్పీ ఎం.వి.రామక్రిష్ణయ్య తెలిపారు.
ఈ మేరకు ఆదివారం స్థానిక అర్బన్‌స్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. తిరుపతికి చెందిన ఎర్రచందనం అక్రమ రవాణా నిరోధక విభాగం టాస్క్‌పోర్స్ పోలీసులు ఇచ్చిన సమాచారం మేరకు.. తిరుపతి టాస్క్‌ఫోర్స్ డీఎస్పీ కేఎం.మహేశ్వరరాజు, బద్వేలు సీఐ వెంకటప్ప, తిరుపతి, కడప టాస్క్‌ఫోర్స్ సిబ్బంది, బద్వేలు సర్కిల్ పోలీసులు గోపవరం ప్రాజెక్టు కాలనీ వద్ద వాహనాల తనిఖీ చేపట్టారని తెలిపారు. పీపీకుంట వైపు నుంచి వచ్చిన ఒక ఐచర్(మినిలారీ) వాహనం, సుమో, మారుతి కార్లను పోలీసులు ఆపేందుకు ప్రయత్నించారని పేర్కొన్నారు.
వాహనంలోని వారు ఏమాత్రం లెక్కచేయకుండా పోలీసులను వాహనాలతో తొక్కించే ప్రయత్నం చేశారని తెలిపారు. వారు ఆపకుండా పారిపోతుండగా పోలీసులు తమ వాహనాలతో వెంటపడ్డారని చెప్పారు. ద్వారకా కన్ స్ట్రక్షన్ సమీపంలోని గరుడయ్య సత్రం వద్ద మూడు వాహనాలను ఆపి, అందులోని 13 మంది వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారని వివరించారు. వాహనాలను తనిఖీ చేయగా అందులో సుమారు 684 కిలోల 33 ఎర్రచందనం దుంగలు ఉన్నట్లు గుర్తించారని చెప్పారు. వాటితోపాటు మూడు వాహనాలు, 14 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
బెంగళూరుకు తరలిస్తుండగా..
వారిని విచారణ చేపట్టగా ఎర్రచందనం దుంగలను బద్వేలు సమీపంలోని ఎర్రశెల అటవీ ప్రాంతంలో నుంచి బెంగళూరుకు చెందిన అప్సర్‌ఖాన్, అంజాద్‌ఖాన్‌లకు చేరవేసేందుకు తీసుకుపోతున్నట్లు తేలిందన్నారు. అదుపులోకి తీసుకున్న వారిలో కర్ణాటక రాష్ట్రంలోని పోలార్ జిల్లాకు చెందిన నారాయణ నగేష్, సయ్యద్ ఖబీర్, సయ్యద్ ఫిరోజ్, వెంకటేషప్ప మంజునాథ, చిక్‌బల్లాపూర్‌కు చెందిన సయ్యద్ అజ్ఘర్‌లతో పాటు తమిళనాడు రాష్ట్రంలోని వేలూరు జిల్లాకు చెందిన శివాజీ తిరుపతి, మంత్రాజం జయకుమార్, రామస్వామి రామక్రిష్ణ, గాండీవన్ తమిళ అరుసు, కేరళ రాష్ట్రంలోని పాలకాడ్ జిల్లాకు చెందిన మహ్మద్ అరీష్ , మహ్మద్ బషీర్‌లతో పాటు చిత్తూరు జిల్లా బంగారు పాళెంకు చెందిన గుండాల సంతోష్‌కుమార్, బద్వేలు యార్లబోయిన చంద్రశేఖర్ ఉన్నట్లు తెలిపారు.
ఎర్రచందనం దుంగలతో పాటు మూడు వాహనాలు, 14 సెల్‌ఫోన్ల విలువ సుమారు కోటి 57 లక్షల 70 వేలు ఉంటుందని తెలిపారు. ఈ దాడులలో పులివెందుల అర్బన్ సీఐ ఎ.ప్రసాద్, కొండాపురం సీఐ వెంకటేశ్వర్లు, టాస్క్‌ఫోర్స్ ఎస్‌ఐ హాజీవల్లి, బద్వేలు అర్బన్, రూరల్ ఎస్‌ఐలు నాగమురళి, నరసింహారెడ్డి, తిరుపతి, కడప టాస్క్‌ఫోర్స్ సిబ్బందితో పాటు బద్వేలు సర్కిల్ సిబ్బంది ఉన్నట్లు పేర్కొన్నారు. పేరుమోసిన స్మగ్లర్లను, కూలీలను అరెస్టు చేసిన అధికారులను తిరుపతి రెడ్ శాండిల్ టాస్క్‌ఫోర్స్ డీఐజీ కాంతారావు, కడప జిల్లా ఎస్పీ డాక్టర్ నవీన్‌గులాఠీలు అభినందించినట్లు ఆయన వివరించారు.