ఎంపీడీఓల బదిలీలకు ఒత్తిళ్లు
సాక్షి ప్రతినిధి, విజయనగరం :తమకు అనుకూలమైన ఎంపీడీఓలను నియమించుకునే పనిలో టీడీపీ నేతలు నిమగ్నమయ్యారు. ఈమేరకు జెడ్పీ అధికారులకు సిఫారసు లేఖలిస్తున్నారు. కోరిన విధంగా నియామకాలు చేపట్టాలని ఒత్తిడి చేస్తున్నారు. అయితే తాము ఇప్పుడేమీ చేయలేమని జెడ్పీ అధికారులు చేతులెత్తేశారు. ప్రభుత్వం జారీ చేసిన జీవో ప్రకారం ఇటీవల బదిలీలు చేశామని, కొత్త ప్రభుత్వం ప్రత్యేక ఉత్తర్వులిస్తే తప్ప మార్పులు చేర్పులు చేసే అధికారం లేదని వారు చెప్పడంతో పరువుపోతుందని భావించిన తెలుగుతమ్ముళ్లు ఎంపీడీఓల బదిలీ కోసం ఏ చిన్న అవకాశాన్నీ వదలడం లేదు. ఎన్నికల ఫలితాలు తమకు అనుకూలంగా వచ్చిన దగ్గరి నుంచి ఎంపీడీఓల విషయంలో టీడీపీ నేతలు ప్రత్యేక దృష్టి సారించారు.
కాంగ్రెస్ అధికారంలో ఉన్నంతకాలం పలువురు ఎంపీడీఓలు ఇష్టారాజ్యంగా వ్యవహరించారని, తమను కనీసం పట్టించుకోలేదన్న అక్కసుతో ఉన్న వారు... తమ మాట వినని వారిని బదిలీచేయించి, అనుకూలంగా ఉన్న వారిని రప్పించుకోడానికి తీవ్రంగా యత్నిస్తున్నారు. ఎన్నికల ముందు బదిలీ అయిన ఎంపీడీఓలంతా తిరిగి తమ సొంత జిల్లాకు వస్తున్నారని తెలుసుకున్న టీడీ పీ నేతలు తమ మండలాలకు ఫలా నా ఎంపీడీఓలను నియమించాలని జిల్లా పరిషత్ అధికారులకు సిఫారసు లేఖలిచ్చారు. కానీ, టీడీపీ నేతల దూకుడుకు ఇంతకుముందు వరకూ గవర్నర్ పాలనలో ఉన్న సర్కార్ కళ్లెం వేసింది.
ఎన్నికలకు ముందు పనిచేసిన స్థానంలోనే బదిలీ అయిన ఎంపీడీఓలను మళ్లీ నియమిం చాలని ప్రత్యేక ఉత్తర్వులిచ్చింది. దీంతో జెడ్పీ అధికారులు ఏమీ చేయలేకపోయారు. నిబంధనలకు విరుద్ధంగా పోస్టింగ్‌లివ్వలేమని కరాఖండీగా చెప్పేశారు. అయినా జెడ్పీ అధికారులను టీడీపీ నేతలు వదలడం లేదు. ఏం చేస్తారో తెలియదు గాని తాము చెప్పినోళ్లకి పోస్టింగ్స్ ఇవ్వావల్సిందేనని మళ్లీ ఒత్తిడి తెస్తున్నారు. ఎమ్మెల్యేలతో సంతకాలు చేయించి లేఖలిస్తున్నారు. ఏదొక మెలిక పెట్టి బదిలీలు చేయాలని లేదంటే తమ పరువు పోతుందని చెప్పకనే చెబుతున్నారు. ఎంత హడావుడి చేసినా తమనేమీ చేయలేకపోయారంటూ సదరు ఎంపీడీఓలు అహం ప్రదర్శించే అవకాశం ఉందని, అందుకే బదిలీ చేయాలని ప్రాధేయపడుతున్నారు.
ఇరకాటంలో జెడ్పీ అధికారులు
ఇటు ప్రభుత్వం ఉత్తర్వులు, అటు టీడీపీ నేతల ఒత్తిళ్లతో జెడ్పీ అధికారులు ఇరకాటంలో పడ్డారు. నిబంధనలకు విరుద్ధంగా బదిలీలు చేస్తే తమ ఉద్యోగానికి ఎసరొస్తుందని, కావాలంటే ప్రభుత్వం నుంచి ప్రత్యేక ఉత్తర్వులు తెప్పించుకోవాలని, అంతకుమించి చేసేదేమి లేదని జెడ్పీ అధికారులు చెబుతున్నారు. అయినా కొంతమంది టీడీపీ నాయకులు ఒప్పుకోవడం లేదు. చేయాల్సిందేనంటూ పట్టు బడుతున్నారు. మరి కొందరు మాత్రం ఎమ్మెల్యేలను ఆశ్రయించి, ప్రభుత్వం ద్వారా ఉత్వర్వులు తీసుకొచ్చే పనిలో నిమగ్నమయ్యారు. క్యాబినెట్ తొలి సమావేశం ముగిసాక మంత్రులతో మాట్లాడి బదిలీలకు సంబంధించి ప్రత్యేక ఉత్తర్వులు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తామని అనుచరులకు ఎమ్మెల్యేలు హామీ ఇస్తున్నారు.